హనుమకొండ, మే 30 : బీఆర్ఎస్ కార్మికులకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమానికి కృషి చేస్తున్నదని జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. గురువారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 420 హామీలు, 6 గ్యారంటీలు అంటూ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఆటో కార్మికులకు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నెలకు రూ.15 వేల భృతి ఇవ్వాలని, కార్మిక భవన్ నిర్మాణానికి ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తాను పదవిలో ఉన్నా లేకున్నా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. తన రాజకీయ జీవితం కార్మికులతో మొదలైందన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయం లో 10:30 గంటలకు నిర్వహించే సదస్సుకు కార్మికులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ నాయిని రవి, పుల్ల శ్రీనివాస్, నాయకులు ఇంజాల మల్లేశం, రవీందర్‌రెడ్డి, తేలు సారంగపాణి, కాస్వజు ప్రవీణ్, జన్ను సంజీవ, శ్రీధర్‌రెడ్డి, అరుణ్ కుమార్, కాటపురపు రాజు, భిక్షపతి కృష్ణ, రవి పాల్గొన్నారు.