హనుమకొండ, జూలై 28: ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆశ కార్యకర్తలకు నెలకు రూ. 18000లు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలు గడు స్తున్నా పట్టించుకోక మోసం చేసిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్టీయూ అనుబంధ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల(ఆశ) సంఘం ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ నాయిని రవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆశ వర్కర్లను గత సీఎం కేసీఆర్ గుర్తించి రూ. 2 వేలున్న పారితోషికాన్ని రూ. 9 వేలకు పెంచి గౌరవించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా కనీసం వేతనం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రమాద బీమా పాలసీ లేదని, ఎన్సీ టార్గెట్స్ పెట్టడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక హామీ నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు.
రానున్న రోజుల్లో అన్ని వర్గాలను ఏకం చేసి వారి సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్ మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని, చిల్లర మల్లర యూనియన్ల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అనంతరం పలు తీర్మానాలు పెట్టి ఆమోదించారు. సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకర్, ఆశ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషి, రాష్ట్ర సలహాదారు మంజుల, జి యువరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.