ఖానాపురం, ఏప్రిల్ 2 : తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రామలింగయ్యపల్లి సొసైటీ గోదాం ఆవరణలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని, నాలుగేండ్లలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పాకాలకు గోదావరి జలాలను తీసుకొచ్చి, యాసంగిలో పూర్తిస్థాయి పంటలకు నీటిని విడుదల చేసినట్లు చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ దేశానికే రోల్‌మోడల్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామలింగయ్యపల్లి సొసైటీ గోదాం ఆవరణలో ధర్మరావుపేట, బుధరావుపేట, మంగళవారిపేట, వేపచెట్టుతండా, బోటిమీదితండా, కొడ్తిమాట్తండా, నాజీతండా, భద్రుతండాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులతో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మొదట బుధరావుపేట వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి రామలింగయ్యపల్లి వరకు ర్యాలీగా వచ్చారు.
మహిళలు, నాయకులు బోనాలు ,డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ నియోజకవర్గంలోని కార్యకర్తల కష్టంతోనే తాను తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టానన్నారు. 40 ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి చట్టసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకులు చేయలేని పనిని కేవలం ఒకేసారి గెలిచిన తాను 4 ఏండ్లలోనే చేసి చూపించానన్నారు. గతంలో గెలిచిన నాయకులే పాకాలకు గోదావరి జలాలు తీసుకువచ్చి ఉంటే ఇప్పటికే ఈ ప్రాంత ఎంతో అభివృద్ధి చెందేదని అన్నారు. కరోనా కష్టకాలంలోనే ప్రజల మధ్యనే ఉన్నట్లు చెప్పారు. వడగండ్ల వానకు పంటలు కోల్పోయిన రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ను నియోజకవర్గానికి తీసుకొచ్చి నష్టాన్ని చూపించామన్నారు. కొందరు ప్రతిపక్ష నాయకులు దీనిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నాలుగేండ్ల్లు దుప్పటి కప్పుకొని పడుకున్న ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఓట్ల కోసం మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారన్నారు.
మంగళవారిపేట భూములకు పట్టాలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. మంగళవారిపేటకు చెందిన 1488 ఎకరాల భూములకు త్వరలోనే పట్టాలివ్వనున్నట్లు తెలిపారు. మండలంలోని కోట్లాది రుపాయలతో జీపీ భవనాలు, బీటీరోడ్లు, సీసీ రోడ్లు మంజూరు చేయించానని తెలిపారు. ఇప్పటికే 25 శాతం మాత్రమే పనులు అయ్యాయన్నారు.
కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యం..
బీఆర్ఎస్ పార్టీని రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకురావడంలో బీఆర్ఎస్ కార్యకర్తల కృషి ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపై ఉందన్నారు. ఇకపై పనిచేసే వారికే పార్టీలో పదవులు ఉంటాయని, పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని కోరారు. ఇకపై గ్రామాల్లో ప్రతినెలకు ఒకసారి సమావేశం జరగాలన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. సమ్మేళనంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.