మరిపెడ, ఏప్రిల్ 2 : దేశానికి బువ్వపెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగ వాతావరణంలో జరిగింది. ఎమ్మెల్యే రెడ్యానాయక్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎంపీ, మానుకోట జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పాల్గొనగా, వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్… పిర్ ఏక్‌బార్ సీఎం కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణలో రైతు రాజ్యం ఉందని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం న్యాయబద్ధంగా రాష్ర్టానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నదని విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టేస్థాయికి ఎదిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ పట్టణంలో ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా జరుగగా, మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ‘ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్…పీర్ ఏక్‌బార్ సీఎం కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకుల నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం కునారిల్లిపోయిందన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కట్టి సాగు రంగానికి పునరుజ్జీవం పోశారన్నారు. బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నదన్నారు. ఉపాధి పథకాన్ని నీరుగార్చి కూలీల పొట్టగొట్టే కుట్రలు చేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈజీఎస్ పథకం కింద సీసీ రోడ్లు వేసిన సర్పంచ్‌లకు రూ.800 కోట్లు విడుదల చేయకుండా కేంద్రం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో విస్తరిస్తున్న బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకే ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణతో మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నదన్నారు. కవితకు అండగా ఉంటామని, తగ్గేదే లేదని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
ఉనికి కోసం విపక్షాల ఆపసోపాలు : మ్ంరత్రి సత్యవతి
సీఎం కేసీఆర్ సారథ్యంలో సుభిక్షమైన పాలన అందుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఉన్నాయని గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్‌కు తనకు మధ్య ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని, ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే నలిగిపోతారన్నారు. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే విపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ టీడీపీ అధినేత సిఫారసు మేరకు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని పెట్టుకున్నదన్నారు. మునుగోడు, హుజూరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీ నోటీసుల పేరుతో ఎమ్మెల్సీ కవితను ఇబ్బందిపెడుతూ కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించిన బీజేపీ శ్రేణులకు పల్లెల్లో తిరిగే హక్కు లేదన్నారు. గిరిజన ఆవాసాల్లో రోడ్ల నిర్మాణం కోసం గిరిజన సంక్షేమ శాఖ నుంచి రూ.2వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. విపక్షాల కుటిల రాజకీయాన్ని ఎండగట్టాలని ఆమె పిలుపునిచ్చారు.