నడికూడ, ఫిబ్రవరి 21 : రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు దుర్మరణం పాలయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. సంతోషంగా బుల్లెట్ బండిపై ఇంటికి వెళ్తున్న అన్నదమ్ములను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో స్నేహితుడు గాయాలతో బయటపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద ఘటన హనుమకొం డ జిల్లా నడికూడ మండలంలోని కంఠాత్మకూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
దామెర పోలీసుల కథనం ప్రకా రం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచా రం గ్రామానికి చెందిన ఉప్పల చంద్రానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు రాజ్‌కుమార్ (25) ప్రైవేటు జాబ్ చేస్తుండగా, చిన్న కొడుకు శంకర్ (22) ఐటీఐ సెకండియర్ చదువుతున్నారు. ఇద్దరూ హనుమకొండలో వేర్వేరుగా ఉంటున్నారు. కాగా, గురువారం రాత్రి 11 తర్వాత తమ స్నేహితుడు బండారి శివకుమార్‌తో కలిసి బుల్లెట్ బండిపై వారి స్వగ్రామం నాచారానికి బయలుదేరారు.
శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటల తర్వాత నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద గుర్తు తెలియ ని వాహనం బుల్లెట్ బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉప్పల రాజ్‌కుమార్ బైక్‌పై నుంచి ఎగిరిపడి అక్కడికక్కడే మృ తి చెందాడు. ఉప్పల శంకర్, బండారి శివకుమార్‌ను 108 వా హనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్తుండగా మా ర్గమధ్యంలో శంకర్ మృతి చెందాడు. ప్రస్తుతం శివకుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దామెర ఎస్సై తెలిపారు.