ములుగు, నవంబర్17(నమస్తేతెలంగాణ) : మేడారం జాతరకు ఇంకా 70రోజుల సమయం మాత్రమే ఉంది. మల్లంపల్లిలో బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. తాత్కాలిక బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రయాణికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై మంత్రులు మందలించినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ఈ సమ స్య ఎప్పుడు తీరుతుందోనని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2026 జనవరిలో నిర్వహించనున్న మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వారు జాతీయ రహదారి 163మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
కానీ ఎన్హెచ్ విస్తరణలో భాగంగా మల్లంపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఎన్టీఆర్ హయాంలో కాల్వపై నిర్మించిన పురాతన బ్రిడ్జి ఈ ఏడాది ఆగస్టు 7న కూలిపోయింది. దీంతో 15 రోజులపాటు రాకపోకలు నిలిచిపోవడంతో ఎన్హెచ్ అధికారులు బ్రిడ్జిని కొంత మేరకు తొలగించి తాత్కాలికంగా బ్రిడ్జి నిర్మించారు. ఈ దారిపై ఇప్పటికే ఇసుక లారీలతో పాటు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. భారీ వాహనాల వల్ల బ్రిడ్జి రెండు పక్కలా మట్టి కుంగిపోవడంతో ఈ నెల 6న మరమ్మతులు చేశారు. అయితే ప్రస్తుతం నిత్యం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు, వాహనదారులు పేర్కొంటున్నారు.
వచ్చే నెల నుంచి మేడారం జాతర ముందస్తు మొక్కుల్లో భాగంగా స్వరాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు వాహనాల ద్వారా మేడారానికి చేరుకోనున్నారు. ఈ సమయంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, సమస్య ఇలాగే ఉంటే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉన్నదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి పనులు జరుగుతుండగా దక్షిణం వైపు గోడ నిర్మాణం పూర్తి కాగా, ఉత్తరం వైపు గోడ కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. ఈ విషయమై ఇటీవల జరిగిన సమీక్షలో ఎన్హెచ్ అధికారులను మంత్రులు మందలించారు. పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా పనులు మాత్రం నత్తనడకనే కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి భక్తులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.