కేసముద్రం, సెప్టెంబర్ 25 : మండలంలోని నారాయణపురం గ్రామంలో బాలుడిని మృత్యు వు వెంటాడింది. జూలై 31న గుర్తుతెలియని దుండగులు చిన్నారి గొంతు కోయగా, ఈ నెల 24న ఉరి వేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఉపేందర్-శిరీషకు ముగ్గురు కుమారులు మనీష్‌కుమార్ (6), మోక్షిత్, నిహాల్ (లేట్) జన్మించారు.
జూలై 31న తెల్లవారుజామున మనీష్‌కుమార్ నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మెడపై కత్తితో దాడి చేయగా కేకలు వేయడంతో పారిపోయారు. చికిత్స చేయించగా కోలుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 24న ఉపేందర్ డ్రైవర్ పనికి వెళ్లగా, నాయనమ్మ మంగమ్మ పత్తి తీయడానికి, తాత ఎల్లయ్య మేకలు కాయడానికి వెళ్లారు.
తల్లి శిరీష ఇంటి సమీపంలో కాలనీవాసులతో కలిసి బతుకమ్మ ఆట ఆడడానికి వెళ్లింది. మంగమ్మ సాయంత్రం ఇంటికి వచ్చి లోపలికి వెళ్లి చూడగా మనీష్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. మెడ చుట్టు నల్లగా కమిలి ఉండడంతో ఉరి వేసి చంపి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. బాలుడిని కక్షగట్టి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని చర్చించుకుంటున్నారు.
జనవరిలో నిహాల్ మృతి..
చిన్న కుమారుడు నిహాల్ ఈ ఏడాది జనవరిలో ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. మొదట రెండు సార్లు నీటి సంపులో పడి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే మనీష్ కుమార్‌పై కత్తితో దాడి జరగడం, తర్వాత చనిపోవడంతో చిన్న కుమారుడు నిహాల్ మృతిపై కూడా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.