పేదలకు సైతం ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎంజీఎం వైద్యశాలలో రూ.10.6కోట్లతో అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక ఎంఆర్ఐ యంత్రాన్ని, ప్రత్యేక టైప్ వన్ డయాబెటిక్ క్లినిక్‌ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌తో కలిసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతి ప్రజలకు పెద్దదిక్కయిన ఎంజీఎంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే అన్ని సౌకర్యాలు కల్పించిందని గుర్తుచేశారు. వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ రూ.1200కోట్లతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నారని చెప్పారు.
– వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 7
వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 7 : పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను అందుబాటులోకి తేవడంతోపాటు మెరుగైన వైద్యసేవలు అందించి ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఎంజీఎం దవాఖానలో ‘తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎంఎస్‌డీసీ) ఆధ్వర్యంలో రూ.10.6కోట్లతో అందుబాటులోకి తెచ్చిన ఫిలిప్స్ కంపెనీకి చెందిన 1.5 టెస్లా సిస్టమ్ సామర్థ్యం కలిగిన మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) యంత్రాన్ని, టైప్ వన్ డయాబెటిక్ క్లినిక్‌ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి శనివారం మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంజీఎం హాస్పిటల్ పెద్ద దిక్కుగా నిలిచిందన్నారు. ఉమ్మడి పాలనలో ప్రైవేట్ హాస్పిటళ్ల ధాటికి కొంత ఇబ్బంది కరమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఎంజీఎంకు కేఎంసీ పూర్వ విద్యార్థుల దాతృత్వంతో కొన్ని యంత్రాలు సమకూరాయని వివరించారు. అలాంటి పరిస్థితి నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎంజీఎం పూర్వవైభవాన్ని పొందుతూ వస్తున్నదని చెప్పారు. వరంగల్‌ను హెల్త్ హబ్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ రూ.1200కోట్లతో దేశంలోనే ఎక్కడాలేని విధంగా 24 అంతస్తులతో 36 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఉచితంగా అందించేందుకు అతిపెద్ద హాస్పిటల్‌ను నిర్మిస్తున్నారన్నారు.
హాస్పిటల్ అందుబాటులోకి వచ్చాక ఇక వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం రాదని, హైదరాబాద్ నుంచే వరంగల్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఉమ్మడి పాలనలో ప్రభుత్వ వైద్యశాలల్లో గుండె ఆపరేషన్లు సరిగా జరగకపోయేవని, ఇప్పుడు 100 శాతం సక్సెస్ రేటుతో చేస్తున్నారన్నారు. కరోనా కాలంలో సుమారు లక్షా ఐదు వేల మందికి ఎంజీఎం వైద్యసేవలను అందించిందని గుర్తుచేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషిచేస్తున్న వైద్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఓపీ, ఏఎంసీ విభాగాల్లో రోగులతో మాట్లాడి వైద్యసేవల తీరును అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంజీఎంను వెయ్యి పడకల స్థాయికి పెంచి తగిన నియామ కాలు చేపట్టి వైద్యసేవలను విస్తృతం చేసిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఉమ్మడి వరంగల్ పరిధిలో ప్రస్తుతం ఏడు మెడికల్ కళాశాలలు ప్రారంభమై విద్యాభ్యాసం కొనసాగు తోందన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ అందించలేక ప్రైవేట్ హాస్పిటళ్లు చేతులెత్తేసినా ఎంజీఎం పెద్ద దిక్కుగా నిలిచి ప్రాణాలు పోసిందని గుర్తుచేశారు. ప్రస్తుత ఆహారపు అలవాట్లతో చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్న వారికి ప్రత్యేకంగా ఓసీ విభాగంలో క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయ మన్నారు. ఎంజీఎంలో సేవలను మెరుగుపరచడం, విస్తృత పరచడం కోసం కార్పొరేట్ కంపెనీలను సైతం ఒప్పించి నిధులు తెచ్చామని చెప్పా రు. ఎంజీఎంలో డయాలసిస్ సేవలు మెరుగ్గా అందుతున్నాయన్నారు.
సర్కారు వైద్యశాలల్లో ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నదని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఏడాదిపాటు ఎంఆర్ఐ యంత్రం పనిచేయకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకుపోగా వెంటనే ఆయన స్పందించి అత్యాధునిక యంత్రం ఏర్పాటుకు ఆదేశాలిచ్చారని చెప్పారు. ఖరీదైన వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో అందుబాటులోకి తేవడం మూలంగా ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచామన్నారు.రూ.10కోట్లతో ఏర్పాటుచేసిన యంత్రంతో పేదలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులను కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు డాక్టర్ హరీశ్‌రాజ్, డాక్టర్ మురళి, డాక్టర్ రామ్‌కుమార్‌రెడ్డి, 24వ డివిజన్ కార్పొరేటర్ ఆకుతోట తేజస్వి, పలువురు విభాగాధిపతులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.