కురవి, నవంబర్ 8 : లారీల్లో అక్రమంగా తరలిస్తున్న 27.5టన్నుల నల్లబెల్లం, పటిక స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్రపవార్ తెలిపారు. మంగళవారం సీరోలు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. వరంగల్ లేబర్ కాలనీలో నివాసముంటున్న బానోత్ కృష్ణ, సంగెం మండలం చింతలపల్లి చెందిన భాసర్, గూడూరు మండలానికి చెందిన బానోత్ మోహన్ ముఠాగా ఏర్పడి నల్లబెల్లం వ్యాపారం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి లారీల్లో నల్లబెల్లం, పటికను తెచ్చి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్‌తో కలిసి ఏపీలోని చిత్తూరులో 500 బస్తాల నల్లబెల్లం కొనుగోలు చేసి 14 టైర్ల లారీలో లోడ్ చేసుకుని మహబూబాబాద్ వైపు వస్తుండగా, మంగళవారం తెల్లవారుజామున సీరోలు మండలం కాంపల్లి గ్రామక్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న ఎస్సై నరేశ్‌కుమార్ తన సిబ్బంది, టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు.
లారీని సీజ్ చేసి 25 టన్నుల నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ పొదుగు చంద్రం, క్లీనర్ పాయం రమణయ్యను అరెస్టు చేయగా, బానోత్ కృష్ణ, బాదావత్ భాస్కర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం దంతాలపల్లి ఎస్సైతోపాటు సిబ్బంది బొడ్లాడ ఎక్స్ రోడ్ వద్ద ట్రాలీ వాహనంలో 50 బస్తాల్లో తరలిస్తున్న నల్లబెల్లం పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన లకావత్ రాజేశ్(డ్రైవర్), బాదావత్ భాసర్ పరారీలో ఉన్నారని తెలిపారు. పెద్ద మొత్తంలో నల్లబెల్లం పట్టుకున్న ఎస్సైలు లావుడ్యా నరేశ్‌కుమార్, రామారావు, జగదీశ్, సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో తొర్రూరు డీఎస్పీ ఏ రఘు, సీఐలు శ్రీనివాస్, సాగర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
తొర్రూరులో 700 కిలోలు
తొర్రూరు, నవంబర్ 8 : డివిజన్ కేంద్రంలోని పాలకేంద్రం వద్ద మంగళవారం తెల్లవారు జామున పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 700 కిలోల నల్లబెల్లం, 20 లీటర్ల గుడుంబా పట్టుబడినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తవేరా వాహనంలో నెల్లికుదురు మండలం జామ్లతండాకు చెందిన గుగులోత్ సురేశ్ నల్లబెల్లం, గుడుంబా రవాణా చేస్తూ పట్టుబడినట్లు తెలిపారు. వాహనం సీజ్ చేసి సురేశ్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎస్సై రవళి, శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ రబ్బాని, ప్రభాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్‌లో 50 కిలోలు
మహబూబాబాద్ రూరల్, నవంబర్ 8 : మండలంలోని బోడగుట్టతండా, తెల్లబండ తండాలో మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 26 లీటర్ల గుడుంబా, 50కిలోల నల్లబెల్ల, పది కిలోల పటికను స్వాధీనం చేసుకుని, 550 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ రమేశ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.