‘ఉన్నత ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరిన.. పదకొండేళ్లుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డ.. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ జాతీయ నాయకులు నన్ను మోసం చేసిన్రు. సర్వేలన్నీ నాకే అనుకూలంగా వచ్చాయని చెప్పి ఇప్పుడు పొమ్మనలేక పొగబెట్టిన్రు..’ అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన బుధవారం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక ఎజెండా.. మ్యానిఫెస్టో లేని పార్టీ బీజేపీ అని, సిద్ధాంతం పేరుతో యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్నదని మండిపడ్డారు.
హనుమకొండ, నవంబర్ 1 : జిల్లాలో బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి టిక్కెట్ దక్కనివారు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి బీజేపీకి బుధవారం రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మకు రావడంతో భంగపడ్డ రాకేశ్‌రెడ్డి, బీజేపీ అధిష్టానంపై మండిపడ్డారు. తన అనుచరులతో కలిసి బుధవారం సాయంత్రం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. టిక్కెట్ రాకపోవడంతో మనస్తాపానికి లోనైన ఆయన తనను పొమ్మన లేక పొగపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడ్డ తనకు టికెట్ ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వకున్నా కనీసం ఇప్పటి వరకు తనతో ఎవరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పుట్టిన గడ్డకు సేవ చేయాలనే తపనతో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరిన నేను 11 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నందుకు ఎంతో బాధ గా ఉంది’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో వంద శాతం పూర్తి చేశానని చెప్పారు. ఈ పదేళ్లు ఎన్నో కష్టాలు, అవమానాలు భరిం చి పార్టీ పటిష్టానికి పాటుపడ్డానని చెప్పారు. యువ మోర్చా నాయకుడిగా ఉన్నపుడు ఉమ్మడి జిల్లాలో అనే క మంది కార్యకర్తలను తయారు చేశానన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న తనను పార్టీ ఎన్నో సార్లు అవమానించిందని, అవహేళన చేసిందని, జిల్లా కార్యాలయంలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించానని గుర్తుచేశారు. అన్ని అర్హతలు సాధించి నియోజకవర్గంలో ప్రతి ఇంటి గడప తొక్కిన తనకు టికెట్ ఇవ్వాలని కోరినప్పటి నుంచే తనపై పగపెంచుకున్నారన్నారు. ‘రాష్ట్ర నాయకునికి నోటీస్ ఇచ్చే అర్హత జిల్లా అధ్యక్షురాలికి ఉంటుందా? అసలు ఇదేం పార్టీ.. ఏ ఒక్క నాయకుడు కూడా అడగలేదు’ అని ప్రశ్నించారు. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ జాతీయ నాయకులు తనను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తనకు అనుకూలంగా వచ్చాయని తెలిపారు. ప్రశ్నించే గొంతును నొక్కేయడంతో పాటు ప్రజాబలం ఉన్న వారిని బీజేపీ తొక్కేస్తోందని ధ్వజమెత్తారు. పార్టీలో యువతకు, ప్రతిభ ఉన్నవారికి సైతం స్థానం లేదని, వారిని ఎదగనివ్వరని మండిపడ్డారు. వేలకోట్ల అధిపతి కొడుకు కాబట్టే సెకండ్ లిస్ట్‌లో జితేందర్‌రెడ్డి కొడుక్కు టికెట్ ఇచ్చారని, తాను ఓ రైతు బిడ్డను కాబట్టే తనకు టికెట్ ఇవ్వలేదన్నారు.
బీజేపీ సిద్ధాంతాలు లేని పార్టీ ఆని రాకేశ్‌రెడ్డి విమర్శించారు. బీజేపీకి అసలు ఒక ఎజెండా.. మ్యానిఫెస్టో అంటూ ఉందా అని ప్రశ్నించారు. మ్యానిఫెస్టోనే లేకుండా ఏముఖంతో ఎన్నికల ప్రచారానికి పోతారని నిలదీశారు. అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ తనకే టికెట్ ఇవ్వాలని సూచించినా ఇవ్వలేదన్నారు. ఒక్క తేజస్వి సూర్యకు టికెట్ ఇచ్చి యువతకు ప్రాధాన్యత ఇచ్చామని బీజేపీ అధిష్టానం అంటోందని, బీజేపీకి పట్టిన శని గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అని, ఆయన కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదని ఆరోపించారు. ప్రజాబలం లేని ఆయన జిల్లా రాజకీయాలను శాసిస్తున్నాడని విమర్శించారు. వర్గాలను ఏర్పాటు చేసి పార్టీని నాశనం చేస్తున్నాడని దుయ్యబట్టారు. సిద్ధాంతం అంటూ యువత భవిష్యత్తును బీజేపీ నాశనం చేస్తోందన్నారు. బీజేపీయే ప్రత్యామ్నాయం అని ప్రజలు నమ్మినా కొందరి వ్యవహారంతో అట్టడుగుకు పడిపోయిందన్నారు. ప్రజలు గుర్తించిన తనను, బీజేపీ మాత్రం గుర్తించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రావు పద్మకు పోటీ రాకేశ్రెడ్డితోనా లేక ఇతర పార్టీలతోనా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఏడు సీట్లలో కూడా బీజేపీ గెలవదన్నారు. తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో లావుడ్య రవినాయక్, దేవయ్య, రాకేశ్‌రెడ్డి అనుచరులు పాల్గొన్నారు.