వరంగల్ చౌరస్తా: దేశ వ్యాప్తంగావున్న పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ దుకాణాలను శనివారం భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా శాఖ తరఫున సందర్శించారు. బియ్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేననంటూ రేషన్ లబ్ధిదారులకు వివరించారు. షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేసి, ప్రధాని మోదీ చిత్రపటం ఏర్పాటు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్రానికి అనకూలంగా నినాదాలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి రేషన్‌కార్డు లబ్ధిదారుడికి కేంద్రం బియ్యం సరఫరా చేస్తోందన్నారు. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యానికి ఇంతగా హంగులు ఆర్భాటాలు చేయడం సిగ్గుచేటన్నారు.ఇప్పటికైనా మోదీ చిత్రపటాలను రేషన్ దుకాణాల వద్ద ఏర్పాటు చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బాకం హరిశంకర్, రంజిత్, మదాసి రాజు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.