నల్లబెల్లి, జులై 08 : దివ్యాంగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ.6 వేలు వెంటనే మంజూరు చేయాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ఇండియా నర్సంపేట డివిజన్ అధ్యక్షులు భూక్య రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవో ఉమా రాణికి దివ్యాంగుల సంఘం నాయకులు మెమోరండం ఇచ్చారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు మాట్లాడుతూ డివిజన్లోదివ్యాంగుల పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు,సబ్సిడీ రుణాలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్న కొత్త పింఛన్లు రాక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు.
పెండింగ్ పెన్షన్స్ మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 6వేలకు వెంటనే పెంచి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో దుగ్గొండి మండల అధ్యక్షుడు చింత కుమారస్వామి, శివ తదితరులు పాల్గొన్నారు.