వరంగల్, జూలై 10 : భద్రకాళీ అమ్మవారు గురువారం శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు అద్వర్యంలో ఉదయం 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అర్చకులు 10 క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో అమ్మవారిని అలంకరించి ఉదయం 10 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. భద్రకాళీని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వారికోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు భక్తులకు తాగునీరు, బాదం పాలు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఏవీవీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, సేవాసమితి సభ్యులు భక్తులకు సేవలందించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయానికి వచ్చి, జ్యోతి ప్రజ్వలన చేసి, కూరగాయలు సమర్పించి, శాకంబరీ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి హోదాలో శాకంబరీ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్ణమని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సైతం కుటుంబ సభ్యులతో భద్రకాళీని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో శేషుభారతి, ధర్మకర్తలు అనంతుల శ్రీనివాసరావు, తోపునూరి వీరన్న, మయూరి రామేశ్వర్రావు, ఓరుగంటి పూర్ణ, తొగరు క్రాంతి, గాదె శ్రవణ్‌కుమార్‌రెడ్డి, గాండ్ల స్రవంతి, సుగుణాఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాగా, 15 రోజులపాటు వైభవంగా జరిగిన ఉత్సవాలు భద్రకాళీ అమ్మవారికి శాకంబరీ అలంకరణతో ముగిశాయి.