ములుగు రూరల్, ఆగస్టు 23 : దళితబంధు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ములుగు జిల్లా లబ్ధిదారులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈమేరకు అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ములుగు జిల్లాకేంద్రం నుంచి లబ్ధిదారులు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్ మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన లబ్ధిదారులందరికీ మొదటి విడుత కేటాయించిన రూ.3లక్షలను తక్షణమే వారి అ కౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించి న నిధులను ఖాతాల్లో జమ చేయకపోవడం తీరని అన్యాయమని అన్నారు.
ఇప్పటికైనా సీఎం, డిప్యూటీ సీఎం తక్షణమే స్పందించి దళితులకు న్యాయం చేయాలని కోరారు. కనీసం లబ్ధిదారులకు మంత్రులు అపాయింటెమెంట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో సాధన సమితి ఉపాధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్, గౌరవ సలహాదారుడు దర్శనాల సంజీవ, సలహాదారు బాలనర్సు, నాయకులు కార్తీక్, బుల్లబ్బాయి, వివిధ నియోజకవర్గాల లబ్ధిదారులు పాల్గొన్నారు.