హనుమకొండ, నవంబంర్ 1 : తాము అధికారంలోకి వస్తే చేయూత (ఆసరా) పింఛన్లు పెంచి ఇస్తామని, కొత్తవి మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఎప్పుడు అమలువుతుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై పదినెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారని ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రతి నెలా పింఛన్లు వచ్చేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలల తరబడి ఆలస్యమవుతున్నాయని మండిపడుతున్నారు. పింఛన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్న తాము ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వాపోతున్నారు. దీనికి తోడు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామంటూ ఆర్భాటంగా తీసుకున్న దరఖాస్తులకు ఇంకా మోక్షం లభించడం లేదు. పెంచే పింఛన్ కోసం లబ్ధిదారులు, కొత్త వాటి కోసం దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాటి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెలా కొత్త పింఛన్లు మంజూరు చేసేది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు 7,493 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వీరిలో వృద్ధులు 2,152, వితంతువవులు 2,427, వికలాంగులు 1,307, కల్లుగీత కార్మికులు 476, చేతనే కార్మికులు 253, బీడీ కార్మికులు 254, ఒంటిరి మహిళలు 594 మంది ఉన్నట్లు సమాచారం.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అండగా నిలిచిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 200 ఉన్న పింఛన్‌ను రూ. 1,000కి, రూ. 500 ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 1,500కు పెంచింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలకిచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్‌ను రూ. 2,016కు, దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 3,016కు పెంచి అండగా నిలిచింది. ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్‌దారులకు అందజేసింది. కాగా, గత ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లు ఈ నెలలో లబ్ధిదారులకు అందజేసినట్లు ఆ శాఖ అధికారులే చెప్పడం గమనార్హం.
ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. పింఛన్ పెంచడం, కొత్తవి మంజూరు చేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. కొత్తగా వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించి నివేదికను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేస్తున్నాం. అలాగే సెప్టెంబర్ నెల పింఛన్లకు సంబంధించి ఎఫ్‌టీవో జనరేట్ చేశాం.
– నాగపద్మజ, డీఆర్డీవో, హనుమకొండ జిల్లా