ఖిలావరంగల్, ఏప్రిల్ 08 : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ నత్త నడకన సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పర్వదినం నుంచి సన్న బియ్యం పంపిణీ జరిగితే వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని తూర్పు నియోజకవర్గంలో ఈ నెల 5న ఆరు రోజుల ఆలస్యంగా పంపిణీ చేశారు. అయితే ప్రారంభించి మూడు రోజులు కాలేదు అప్పుడే పలు రేషన్ షాపుల్లో నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు. మరి కొంత మంది డీలర్లు బియ్యం ఉన్నా ఇచ్చే తీరక ఓపిక లేక రేషన్ షాపుకు తాళం వేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఎంతో ఆర్బాటంతో ప్రచారం చేయడంతో పేదలు ఆశగా కార్డులు తీసుకొని రేషన్ షాపుల బాట పడుతున్నారు. అయితే షాపులకు వెళ్లిన లబ్దిదారులకు స్టాక్ రాలేదని డీలర్లు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యం స్టాక్ అయిపోయింది. దొడ్డు బియ్యం మాత్రమే ఉన్నాయని డీలర్లు చెప్పడంపై లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ మండలంలో 85 రేషన్ షాపులకు సుమారు 8,700 క్వింటాళ్లు, ఖిలావరంల్ మండలంలో 72 రేషన్ షాపులకు 8,700 క్వింటాళ్ల బియ్యం ఏనుమాములలోని బఫర్ గోదాంలోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా జరుగుతుంది. ఆయా రెండు మండల్లాల్లో ని రేషన్ షాపులకు 25 శాతం సన్న బియ్యం ఇంకా సరఫరా జరగాల్సి ఉందని అధికారులు పేర్కొనడం గమనార్హం. సంబంధిత అధికారులు స్పందించి పేదలకు వంద శాతం సన్న బియ్యం పంపిణీ జరిగే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు.