ఏటూరునాగారం, మార్చి 21 : ప్రకృతి ఒడిలో రూపుదిద్దుకున్న సొబగులు అవి. అక్కడి పెద్దపెద్ద బండ రాళ్లు అచ్చెరువొందిస్తాయి. ఎవరో చెక్కినట్లుగా నునుపైన బండరాళ్లు, వాటిపై అంతే సుకుమారంగా కనిపించే పిట్టగూళ్లు, జంతు పాదముద్రల మాదిరి ఆకృతులు మనల్ని కట్టిపడేస్తాయి. ఎవరో పెట్టినట్లుగా ఒక రాయి మీద మరో రాయి మైమరిపిస్తాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో అందాలొలికే ఈ సుందర మనోహర దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.
ఏటూరునాగారం అభయారణ్యంలో సహజ సిద్ధంగా రూపుదిద్దుకున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా అటవీ శాఖ అభయారణ్యాన్ని తీర్చిదిద్దుతుండగా, గతంలో ఎన్నడూ వెలుగులోకి రాని అరుదైన గుట్టలు, లోయలు కనువిందు చేస్తున్నాయి. తాడ్వాయి-ఏటూరు నాగారం మధ్యలో అడవి దున్నలు, దుప్పులు, ఎలుగుబంట్లు, వృక్షాల మాదిరిగా కనిపించే స్వాగత తోరణాన్ని ఇటీవల అటవీశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఇదే దారి వెంట రెండు కిలోమీటర్ల దూరంలో కుడి వైపున ఎత్తయిన గుట్టలు ఉన్నాయి. దీనిపై పర్యాటకులు వేచి ఉండి, వీక్షించేలా రాతి కట్టడాలను నిర్మించారు. కర్రతో తయారు చేసిన స్తంభాలు, ఎరుపు రంగుతో కూడిన పైకప్పును గుడిసె మాదిరిగా నిర్మించారు.
ఇలాంటివి విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే దారిలో కనిపిస్తాయి. ఈ గుట్టపై నుంచి నలుదిక్కులా దట్టమైన అడవి, లోయలు మనోహరంగా కనిపిస్తాయి. అంతే కాకుండా, గాలి వేగం, నీటి ప్రవాహానికి బండ రాళ్లు కోతకు గురై పిట్టగూళ్ల మాదిరి ఆకృతులు, ఇంకో బండపై జంతువుల పాదముద్రల మాదిరి గుర్తులు మైమరిపింపజేస్తున్నాయి. వీటిని చూస్తే పక్షులు ఇక్కడ నివాసముండేందుకు గూళ్లు కట్టుకున్నాయా అని అనిపిస్తుంది. పక్కనే ఒక రాయి మీదమరో రాయి అమర్చినట్లు ఉన్నాయి. వాటిని చూస్తే కాకతీయు ల కాలంలో చెక్కిన రాళ్లను ఇక్కడికి తెచ్చి పెట్టారా అనే సందేహం కలుగు తుంది.
వన్యప్రాణులు ఇక్కడ సంచరించినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు మండలంలోని చిన్నబోయినపల్లి సమీపంలోని వాచ్‌టవర్, కొండాయి-ఊరట్టం మధ్యలోని కొండ్రేడు వాగు వద్ద వాచ్ టవర్, బ్లాక్ బెర్రీ వంటి అరుదైన ప్రదేశాలు, జాతీయ రహదారి పక్కనే ఉన్న స్వాగత తోరణం నుంచి సుమారు 14 కిలోమీటర్ల పొడవునా దట్టమైన అడవిలో దారి ఉంది. లోనికి ప్రయాణం చేస్తే తాడ్వాయి మండల కేంద్రంలోని హాట్స్ వద్దకు చేరుకుంటారు. అయితే, ఈ మార్గంలో కూడా అనేక గుట్టలు, అరుదైన వృక్ష సంపద ఉన్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల రాక్షస గుహలు (ఆదిమానవుల సమాధులు) వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ కూడా రాళ్లు పక్షుల గూళ్లు, వన్య ప్రాణుల పాదముద్రల్లా ఉండడం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా గుట్టల సమీపంలో అటవీశాఖ అధికారులు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి బోర్లు వేసి వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నారు. ఈ నీళ్లు కూడా ఎంతో మధురంగా ఉండడం కొసమెరుపు.