ఎల్కతుర్తి, జూన్ 11 : మండలంలోని సూరారం గ్రామంలో ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నాలుగైదు రోజులుగా గ్రామంతో పాటు సమీప పొలాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎలుగుబంటి గ్రామంలో రోడ్లపై తిరుగుతుండగా కొందరు మొబైల్లో ఫొటోలు సైతం తీశారు. ఎలుగుబంటి ఫొటోలు చూసిన ప్రజలు బయట తిరగాలంటే భయపడుతున్నారు.
అసలే ఎండాకాలం కావడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఎక్కువగా బయటే నిద్రిస్తున్నారు. అయితే, ఎలుగుబంటి సంచారంతో రాత్రుళ్లు ఎవరు కూడా బయట నిద్రించడం లేదు. పొలాల వద్దకు వెళ్లాలంటే కూడా రైతులు భయపడుతున్నారు. చేతిలో కర్ర పట్టుకునే బావుల వద్దకు వెళ్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి, ఎలుగుబంటిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.