రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట నాటకాన్ని బీసీలు ఎండగడుతున్నారు. తప్పుల తడకగా ఉన్న కులగణనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే బీసీ జనాభాను తగ్గించి చూపుతున్నారని మండిపడుతున్నారు. కులగణన నివేదికను కేబినెట్లో పెట్టి అసెంబ్లీలో చర్చించిన పిదప చట్టబద్ధత కల్పిస్తారనుకుంటే.. తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని సీఎం మెలిక పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని, కామారెడ్డి డిక్లరేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే ఇప్పుడు ఓసీల జనాభా ఎలా పెరిగిందని, బీసీలు ఎందుకు తగ్గారో ప్రభుత్వం సమాధానం చెప్పాలంటున్నారు. 7 శాతం ఉన్న ఓసీలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కాపాడుకునేందుకే కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు. 60 ఏళ్లుగా బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయం జరుగుతున్నదని, మళ్లీ ద్రోహం చేయాలని చూస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. మళ్లీ ప్రత్యేకంగా కులగణన చేపట్టి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
-నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 6
అసంపూర్తిగా కులగణన సర్వే
భూపాలపల్లి రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే మొత్తం అసంపూర్తిగా ఉంది. రాష్ట్రంలో 136 బీసీ కులాలుండగా ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. ఇలాంటి అసంపూర్తి సర్వేను ప్రభుత్వం ఆమోదిస్తే బీసీలు తీవ్రంగా నష్టపోతారు. ప్రజలు అందుబాటులో లేరని బీసీ జనాభాలో కోత విధించారు. కాంగ్రెస్ నాయకులు రైతు భరోసాను రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలకు తగ్గించారు. అలాగే ఇప్పుడు బీసీల సంఖ్యను తక్కువగా చూపించి రిజర్వేషన్ శాతాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. మరో స్పెషల్ డ్రైవ్ చేపట్టి నిజమైన బీసీల సంఖ్యను వెలువరించాలి.
– తాటికంటి నరేశ్, తెలంగాణ పట్టభద్రుల బీసీ నిరుద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఈడబ్ల్యూఎస్ కోటా కోసమే..
ఖిలావరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కోసమే బీసీ జనాభాను తగ్గించి సమగ్ర కులగణన అర్థాన్నే మార్చేసింది. 2011లో 60 శాతం ఉన్న బీసీ జనాభాను ఇరవై లక్షలు తగ్గించి 56.33 శాతంగా చూపించడం విచారకరం. 7 శాతం ఉన్న ఓసీ జనాభాను ఏకంగా 13 శాతంగా చూపించింది. 1 శాతం కోటా ఎస్సీలది. ఇదంతా ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించేందుకు కాంగ్రెస్ చేసిన కుట్ర. 7 శాతం ఉన్న ఓసీ జనాభాకు 10 శాతం రిజర్వేషన్‌ను అంకెల పరంగా సొంతం చేసుకున్న అతి పెద్ద కుట్ర. 20 లక్షల బీసీ జనాభా ఎటు పోయిందో కాంగ్రెస్ పెద్దలే చెప్పాలి. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన 42 శాతం స్థానిక సంస్థల కోటా 60 శాతమున్న బీసీలకు చెందుతుంది. కానీ ఇప్పుడు హిందూ బీసీ అని 46 శాతం చూపడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనమే. మొత్తంగా ఈ లెకలు పెన్సిల్‌తో రాసుకున్నప్పుడే అనుకున్నాం వాళ్లకు కావాల్సిన విధంగా చెరిపేసి రాసుకుంటారని. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలు క్షమించరు. గణన సరిగా చేయకుంటే ఆ పార్టీని బొంద పెడుతరు.
-డాక్టర్ చింతం ప్రవీణ్‌కుమార్, బీసీ రైటర్స్ వింగ్ స్టేట్ చైర్మన్
రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలి
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ‘రిజర్వేషన్లపై మాట తప్పితే ఊరుకోం.. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలి’ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బర్ల గట్టయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పి రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేయాలని చూస్తున్నదని, కులగణనపై ఇప్పటికీ పూర్తి క్లారిటీ లేదని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతరేసి కేంద్రం ఆమోదిస్తేనే రిజర్వేషన్లు అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి కొత్త నాటకాలు ఆడుతున్నాడని, ఇందుకు ఏ మాత్రం ఒప్పుకునేది లేదన్నారు. 2014లో జరిపిన సమగ్ర కుటుంబ సర్వే, ఇప్పుడు చేసిన దానిని పరిశీలిస్తే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అవగతమవుతుందన్నారు.
బీసీల శాతం ఇంకా పెరగాల్సి ఉందని, కులగణనపై అనేక అపోహాలు, అనుమానాలున్నాయని, వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలని, జాబితాను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లుగా బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయం జరుగుతూనే ఉందని గట్టయ్య మండిపడ్డారు. ప్రభుత్వం కులగణన సర్వేను కేబినెట్లో పెట్టి అసెంబ్లీలో చర్చిస్తుందని, చట్టబద్ధత కల్పిస్తుందని ఎదురుచూశామని, తీరా రేవంత్‌రెడ్డి దీనిపై నోరు మెదపకుండా కేంద్రం కోర్టులోకి నెట్టి మోసం చేశారన్నారు. కులగణన తప్పుల తడక అని, మళ్లీ ప్రత్యేక ఫార్మాట్లో సర్వే జరిపించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని గట్టయ్య హెచ్చరించారు.
బీసీలను మోసం చేసేలా సర్వే..
హనుమకొండ చౌరస్తా : కాంగ్రెస్ చేసిన సర్వే బీసీలను మోసం చేసేదిగా ఉంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేనే వంద శాతం కరెక్టు. 2014లో బీసీల జనాభా 1.85 కోట్లు, ఇప్పుడు 1.64 కోట్లుగా తేల్చారు. 21 లక్షల బీసీలను తక్కువగా చూపించారు. ఎస్సీ జనాభా కూడా తారుమారుగా చూపించారు. కానీ ఓసీలు మాత్రం 16 లక్షలు పెరిగినట్లు చూపించారు. ఇది కేవలం ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి చేసిన ఎత్తుగడలో భాగమే. 7 శాతం ఉన్న ఓసీలను దాదాపుగా 13 శాతంగా చూపించారు. అలాగే కులాల వారీగా జనాభాను ప్రకటించాలి.
– పల్లెబోయిన అశోక్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రిజర్వేషన్ పెంచాల్సి వస్తుందనే..
జనగామ రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కులగణన సర్వేలో బీసీ జనాభాను తగ్గించి చూపడం దారుణం. 2011 నుంచి ఇప్ప టి వరకు రాష్ట్రంలో బీసీల జనాభా పెరిగిం దే తప్ప తగ్గలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్వే లెక్కల కంటే కూడా తగ్గించే ప్రయ త్నం చేస్తున్నది. గతంలో 7 శాతం ఉన్న ఓసీలు ఇప్పుడు 16 శాతానికి ఎలా పెరిగారు? బీసీలు ఎలా తగ్గారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జనాభా పెరిగితే బీసీ రిజర్వేషన్ పెంచాల్సి వస్తుందనే ప్రభుత్వం తగ్గించి చూపుతున్నది. దీనివల్ల బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. కులగణన రిపోర్టులను గ్రామాల వారీగా ప్రకటించి బీసీలపై చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి. బీసీ రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
– బాల్దె విజయ, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్, జనగామ
తప్పుల తడకగా సర్వే
పెద్దవంగర : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటి సర్వే పూర్తిగా తప్పుల తడక. రాష్ట్రంలో 100 శాతం సర్వే పూర్తి చేసి నివేదిక వెల్లడించాల్సి ఉంది. కానీ 96.9 శాతం మాత్ర మే చేసి పూర్తయిందంటే ఎలా? మిగతా 3.1 శాతం కుటుంబాల సర్వే చేయకుంటే ఎలా పూర్తవుతుంది. అసంపూర్తి సర్వేను ప్రభుత్వం ఆమోదిస్తే బీసీలు తీవ్రంగా నష్టపోతారు. మళ్లీ పారదర్శకంగా సర్వేని పూర్తి చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.
– దుంపల సమ్మయ్య, సగర సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు, బీసీ సంఘం నాయకుడు