హనుమకొండ, నవంబర్ 17 : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో సీఎంకు పంపిన లేఖ విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు, సవరణ బిల్లు, జీవోలు విఫలమైన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను బీసీ ప్రజానీకానికి తెలపాలన్నారు. రిజర్వేషన్ల సాధనకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర ప్రభుత్వ సహకారానికి సంబంధించిన అంశాలను లేఖలో పొందుపరిచినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు, సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటును లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు చేయకుండా పార్టీ ఆధారిత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేంచేందుకు ప్రభుత్వం ఆలోచించడమంటే బీసీలను మరోసారి మోసం చేసినట్లేనని శేషు పేర్కొన్నారు. సమావేశంలో బీసీ నాయకులు దారబోయిన సతీశ్, నూతనకంటి ఆనందం, బుట్టి శ్యాంయాదవ్, ఎదునూరి రాజమౌళి, సోమిటి అంజన్రావు, చిన్నాల యశ్వంత్ యాదవ్, డాక్టర్ పాలడుగుల సురేందర్, దాడబోయిన శ్రీనివాస్, డాక్టర్ రమేశ్, కేడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.