హనుమకొండ చౌరస్తా, నవంబర్12 : బీసీలు ఏకం కాకుండా వారిలోని ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ఆధిపత్య కులాల కుట్రలను ఎండగట్టాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హ నుమకొండలోని కేయూ ఎస్డీఎల్సీఈ ప్రాంగణంలో కేయూ బీసీ జేఏసీ విద్యార్థి చైర్మన్ ఆరేగంటి నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ల ధర్మ పోరాట దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. బీసీలను విభజించు-పాలించు అనే పద్ధతిలో అగ్రవర్ణ కులాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు.
దేశ స్వాతంత్య్రం కోసం పరాయివారిపై పోరాడిన ప్రజలు నేడు వారి హకుల కోసం దేశంలోని ఆధిపత్య కులాలపై పోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. దేశ సంపదను సృష్టించే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారని మధుసూదనాచారి పేర్కొన్నా రు. సంపదను సృష్టించేది బీసీలైతే రాజ్యాధికారాన్ని చే బూనిన ఆధిపత్య కులాలు ఆ సంపదను కొల్లగొడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ తరహాలో ఉవ్వెత్తున లేస్తున్న బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అగ్రవర్ణ కులాలు కుట్రలు చేస్తున్నాయని, వారి ఉచ్చులో బీసీ నేతలు పడొద్దని సూచించా రు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ, కేయూ ఈసీ మెంబర్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిర్ర రాజుగౌడ్, వరింగ్ చైర్మన్ దొడ్డేపల్లి రఘుపతి, వైస్ చైర్మన్ బోనగాని యాదగిరిగౌడ్, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు రాములు, అజయ్, రాజశేఖర్, అన్వేష్, రవితేజ, నితిన్, వరుణ్సాయి, బసా నాగరాజు పాల్గొన్నారు.