బీసీలకు రాజకీయంగా అవకాశాలు తగ్గించిన కాంగ్రెస్‌పై ఆ వర్గం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ టికెట్లు ఇస్తామని ప్రకటిస్తూ వచ్చిన హస్తం పార్టీ అధిష్ఠానం మొండిచేయి చూపించడంపై విమర్శన అస్ర్తాలు ఎక్కుపెడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో ఒక్క సీటునే కేటాయించడంపై బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. పైసలు, పలుకుబడి ఉన్న వారికే టికెట్లు ఇచ్చి, వెనుకబడిన వర్గాలకు మళ్లీ అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని బీసీ నాయకులు హెచ్చరిస్తున్నారు.
వరంగల్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వెనుకబడిన వర్గాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ టికెట్లు ఇస్తామని ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం… అదనపు టికెట్లు ఇవ్వకపోగా, గతంలో కంటే ఈసారి తక్కువ మంది బీసీలకు అవకాశం ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ అని గొప్పగా చెప్పిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఈ వర్గం వారికి ఇచ్చే సీట్లలోనే భారీగా కోత పెట్టింది. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కచ్చితంగా రెండు సీట్లను బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ జాతీయ నేతలు ప్రకటించారు. బీసీ నేతలతో సమావేశాలు నిర్వహించి ప్రకటనలు చేయించారు. తీరా టికెట్ల కేటాయింపులో మాత్రం బీసీలకు అన్యాయం చేశారు. ఒక లోక్‌సభ సెగ్మెంట్లో కాదు కదా… వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తంలో ఒక్క సీటునే బీసీలకు ఇచ్చారు. గతంలో కంటే ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీసీలకు ఇస్తామని పదే పదే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఈ వర్గానికి సీట్లను పెంచకపోగా సగానికి సగం తగ్గించింది. బీసీలకు రాజకీయంగా అవకాశాలు తగ్గించిన కాంగ్రెస్ పార్టీపై ఈ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్ బీసీల వ్యతిరేక పార్టీ అని ఈ వర్గం నేతలు చెబుతున్నారు. రాజకీయాల్లో తమకు అవకాశాలు కల్పించని పార్టీని తాము పట్టించుకోబోమని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అలాగే వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు.
సామాజికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్యత ఉన్నది.. ఈ వాస్తవాలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వు స్థానాలు మినహా ఏడు జనరల్ సెగ్మెంట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌లో మొదటి నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాలో బీసీలకు ప్రాతినిథ్యం ఉండేది. ప్రస్తుత పీసీసీ నాయకత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అవకాశాలను తగ్గిస్తూ వస్తున్నది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో బీసీలపై నిర్లక్ష్య వైఖరి ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలో బీసీలకు కాంగ్రెస్ నాయకత్వం అన్యాయం చేస్తున్నది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనగామ, వరంగల్ తూర్పు స్థానాలను బీసీలకు కేటాయించింది. 2018లోనూ బీసీలకు ఒక స్థానం పెంచింది. గత ఎన్నికల్లో జనగామ, వరంగల్ తూర్పు, పరకాల సీట్లను బీసీలకు కేటాయించింది. కాంగ్రెస్ అధిష్టానం, పీసీసీ నాయకత్వం ప్రకటనలతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో బీసీలకు గతంలో కంటే ఎక్కువ సీట్లలో అవకాశం వస్తుందని ఈ వర్గం నేతలు భావించారు. ఏడు జనరల్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో ఒక్క వరంగల్ తూర్పు స్థానంలోనే బీసీ వర్గానికి అవకాశం కల్పించింది. 2014 ఎన్నికలతో పోల్చితే ఒక సీటు, గత ఎన్నికలతో పోల్చితే రెండు స్థానాలను బీసీలకు తగ్గింది. గతంలో కంటే ఎక్కువ స్థానాలు ఇస్తామని ప్రకటించిన పార్టీ ఇప్పుడు పైసలు, పలుకుబడి ఉన్న వర్గాలకే టికెట్లు ఇచ్చిందని బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.