ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఆశజూపి.. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు భగ్గుమంటున్నారు. రాజ్యాంగ బద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న మాటలను తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు మంగళం పాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు ఇటీవల ప్రకటించిన కులగణన లెక్కలన్నీ తప్పుల తడకని దుయ్యబట్టారు. ఓసీల జనాభా పెరిగి.. బీసీలు ఎలా తగ్గుతారని ప్రశ్నిస్తున్నారు. వారికోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బడుగులను బలిపెడుతున్నదని ఆరోపిస్తున్నారు. మళ్లీ పారదర్శకంగా సర్వే చేపట్టి.. కులాల వారీగా సమగ్ర లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సూచిస్తున్నారు. తమ ఆవేదనను, విన్నపాలను పట్టించుకోకుండా మోసం చేయాలని చూస్తే బీసీలంతా ఐక్యంగా ఉద్యమిస్తామని సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరిస్తున్నారు. తమ బలమేంటో చూపి కాంగ్రెస్‌ను బొందపెడతామని ఖరాకండిగా చెప్తున్నారు.
– నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 8
కాజీపేట : రాష్ట్రంలో 2014లో అప్పటి ప్రభుత్వం బీసీల జనాభా 52 శాతం నుంచి 56 శాతం ఉన్నదని చెప్పింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణనలో 46 శాతం బీసీలున్నారని తేల్చడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్వేలో పాల్గొనని లక్షలాది మందిని గుర్తించి తిరిగి సర్వే చేయించి, అసలు బీసీల లెక్కను తేల్చాలి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక, రాజకీయ తదితర రంగాల్లో వెనకబడి ఉన్న బీసీ, ఎంబీసీలను గతంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అభివృద్ధికి కృషి చేయలేదు.
రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమించి తెలంగాణను సాధించుకున్న తర్వాత బీసీ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించాలని గత సీఎం కేసీఆర్‌ను కోరడంతో ఆయన సర్వే చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 శాతం ఉన్న ముస్లిం మైనార్టీలను కలిపి మొత్తంగా 56 శాతం బీసీలున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీల లెక్కలు తప్పు అని బీసీ సంఘాలు భావిస్తున్నాయి. తిరిగి సర్వే చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలి.
– ప్రతాపగిరి విజయ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం
హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వే అంతా బూటకం. తప్పుల తడకగా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికను బీసీలందరు వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం ఉంటే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 46 శాతంగా చూపించి మోసం చేస్తున్నది. ఏడు శాతం ఉన్న అగ్రకుల జనాభాను మాత్రం15 శాతంగా చూపించి, బీసీలపై సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్రలో భాగంగా జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారు.
ఓసీలు పెరిగినప్పుడు బీసీలు ఎలా తగ్గుతారు? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. ప్రస్తుత సర్వే ఫలితాలను పూర్తిగా సమీక్షించి, నిజమైన గణాంకాలను వెల్లడించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తప్పకుండాఅమలు చేయాల్సిందే. అలాగే విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్‌ను 52 శాతం పెంచాలి. 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేనే నిజమైనది.
– నాగుర్ల వెంకటేశ్వర్లు, రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్
ఎల్కతుర్తి : బీసీల జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఇటీవల కులగణన చేపట్టిన సర్కారు బీసీల జనాభాను తక్కువగా చూపించడం సరైందికాదు. సమాజంలో జనాభా పెరుగుతుందే తప్ప తగ్గదు. గతంలో చేసిన సర్వేలో 52 శాతం ఉంటే, ఇప్పుడు కేవలం 46.25 శాతమే బీసీలున్నారని నివేదిక ఇవ్వడం మోసం చేయడమే. అలాగే బీసీల్లో ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారో చెప్పలేదు. కేవలం బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప ఆచరణలో మాత్రం చూపడం లేదు. చాలా కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు. దీనివల్ల బీసీల జనాభా ఎంత శాతమో ఎలా లెక్కకడుతారు. వెంటనే రీ సర్వే చేసి పారదర్శకంగా బీసీల వాటాను తేల్చాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి.
– బచ్చు ఆనందం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎల్కతుర్తి
బచ్చన్నపేట : రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నది. జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన వాటాను కుదించే ప్రయత్నం చేయడం తగదు. పది శాతం ఉన్న ముస్లింలను బీసీల్లో కలపడం ఎంత వరకు సమంజసం. దీనిని బట్టే కాంగ్రేస్కు బీసీలపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తున్నది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే మరో పోరాటం తప్పదు. ఈ సారి ఎన్నికల్లో బీసీ వ్యతిరేక పార్టీలకు గుణపాఠం చెప్పక తప్పదు.
– ముశిని రాజు, గౌడ సంఘం జిల్లా నాయకుడు, బచ్చన్నపేట
పరకాల: కుల గణనలో సమగ్ర సమాచారం లేకుండా అసంపూర్తిగా ఉంది. పదేళ్ల క్రితం కంటే బీసీల జనాభా తగ్గడం హాస్యాస్పదం. అన్ని కులాల జనాభా పెరిగితే బీసీల జనాభా ఏ విధంగా తగ్గుతదో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. బీసీలను అణగదొక్కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకే రెడ్డిల ప్రభుత్వం బీసీలపై కుట్రలు చేస్తున్నది. బీసీల్లో ఏ కులం ఎంత జనాభా ఉందో చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కులగణన చేయని కుటుంబాలు గ్రామాల్లో చాలానే ఉన్నాయి. ఇంకా పట్టణాలు.. నగరాల్లో ఎన్ని ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. బీసీ డిక్లరేషన్ మేరకు సమగ్ర కులగణన వివరాలు వెల్లడించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని కాపాడుకోవాలి. లేదంటే బీసీలు చూస్తూ ఊరుకోరు.
– వరికెల కిషన్ రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు
కురవి: రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయకుంటే మా బలమేంటో చూపుతాం. సార్వత్రిక ఎన్నికల్లో బీసీలంతా ఏకమై ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది నామినేషన్లు వేసి సంచలనం సృష్టిస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరిట బీసీల శాతాన్ని తగ్గించి, వారిని రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నది. కులాలకతీతంగా ఏకమై 42 శాతం రిజర్వేషన్లు సాధించుకుంటాం. బీసీలను మోసం చేయాలని చూసే ఏ పార్టీనైనా ఓటు ద్వారా సమాధి చేస్తాం. బీసీలకు రాజ్యాధికారం వచ్చే దాక విశ్రమించేది లేదు. రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం.
– బండారు వెంకటరమణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్