జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినది అర్థం పర్థం లేని యాత్ర అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో నీళ్లు సమృద్ధిగా ఉండగా రాష్ట్రంలో రైతాంగం సంతోషంగా వ్యవసాయం చేసుకుంటోందని, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీతో యువత పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా పరిపాలన కొనసాగిస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులు విషం నింపే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడి బీజేపీ నాయకులు తెలంగాణ అభివృద్ధిని కళ్లు తెరిచి చూడాలన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులు తెలంగాణలో హరితహారం ఒక మహా యజ్ఞమని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ఎంపిక చేసిన దేశంలోని ఉత్తమ గ్రామ పంచాయతీల్లో మొదటి 10 గ్రామ పంచాయతీల్లో 9 అవార్డులు మన రాష్ట్రంలోని జీపీలకే దకిన ఘనత తెలియదా? అని ప్రశ్నించారు. దేశ సగటు ఆదాయంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని, జీడీపీలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రల పేరుతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, అర్థం పర్థం లేని యాత్రలను మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, వృద్ధులకు రూ.2016, వికలాంగులకు రూ.3,016 పింఛన్లు, రైతుబీమా, రైతుబంధు పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకే..
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను సీఎం కేసీఆర్ ఎత్తి చూపుతున్నందున కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఏమైనా ఆధారాలు ఉంటే చట్టం పరిధిలో విచారణ చేపట్టాలిగానీ, మీడియాకు లీకులు ఇచ్చి కవిత వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించేలా చేయడం కేంద్ర ప్రభుత్వ నీతిమాలిన చర్య అన్నారు. మళ్లీ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే ప్రజలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్లోని కవిత ఇంటిపై దాడి చేయడం హేయమైన పిరికి పంద చర్య అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం కవితకు అండగా ఉందని, బీజేపీ కార్యకర్తలను తరిమికొడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, కౌన్సిలర్లు శిరుప అనిల్, బద్దీ సమ్మయ్య, ముంజాల రవీందర్, మాజీ ఎంపీపీ కల్లెపు రఘుపతిరావు, ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం కుమార్రెడ్డి, మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, కో ఆప్షన్ మెంబర్ కరీం, యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు, కరాటే శ్రీను, గాదె రఘు, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.