హనుమకొండ, మే 27: హనుమకొండ చౌరస్తా కేంద్రంగా చిరు వ్యాపారం చేసుకుంటున్న వారి దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా మంగళవారం బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూల్చివేశారు. సుమారు 40కి పైగా షాపులను కూల్చేయగా రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని దుకాణాదారులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఏండ్లుగా ఇక్కడ దుకాణాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. మా బతుకులు ఆగం చేయొద్దని వేడుకొన్నప్పటికి కనికరం చూపలేదని’ బోరుమని మహిళలు విలపించారు.
కూల్చివేతలను ఖండిస్తున్నాం
కాంగ్రెస్ ప్రభుత్వం, బల్దియా అధికారులు చిరు వ్యాపారులపై దాడులు చేసి వ్యాపార సముదాయాలను కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారుల సంఘం నాయకులు నాయిని రవి, ఎండీ ఇస్మాయిల్ ఖండిస్తున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి చిరు వ్యాపారుల సమస్యలు, జీవనోపాధి విషయమై చర్చిస్తున్నప్పటికీ పట్టించుకోకపోగా దాడులు ఎకువైపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో వందలాది మంది చిరు వ్యాపారుల జీవితాలు ఆగం అవుతున్నాయని అన్నారు. చిరు వ్యాపారుల ఉపాధి, భద్రత చట్టం ఉన్న వారి హకులను పాలకులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.