పర్వతగిరి, మార్చి 11 : గత బీఆర్ఎస్(BRS) పాలనలోనే యాదవులకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని తెలంగాణ స్టేట్ గోట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం పర్వతగిరి మండలంలోని బూరుగుమడ్ల గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న పట్నాలను నిర్వహించగా ముఖ్య అతిథిగా బాలరాజు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలరాజు యాదవ్ మాట్లాడుతూ యాదవ సంఘం పటిష్టతకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో యాదవులు ఎంతో ప్రగతిని సాధించారని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే యాదవులకు ప్రత్యేకమైన గుర్తింపుని, ఆర్థిక చేయూతను అందించారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బూర్గుమడ్ల గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు దూదిమెట్ల కుమార్ యాదవ్, వేల్పుల శ్రీను, పెద్దబోయిన వెంకన్న, మాడెం కుమార్, శ్రీనివాస్, యాకయ్య, వెంకన్న, నాగరాజు కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.