నర్సంపేట/దుగ్గొండి/కాశీబుగ్గ, డిసెంబర్19: బలగం సినిమాలో తన పాట ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజ ల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న జానపద కళాకారుడు పస్తం మొగిలయ్య(60) ఇక లేరు. బేడ బుడ గ జంగాలకు చెందిన ఈయన తెలంగాణ ప్రాంతంలో శారద కథల ద్వారా తన పాటలతో అలరించారు. కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె, సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. బలగం సినిమాలో ైక్లెమాక్స్ పాటలో ‘తోడుగా మాతోడుండి.. నీడల మాతో నడిచి’ అనే పాట ద్వారా కుటుంబంలో ఉన్న అనుబంధాలను ప్రతిబింబింపజేశా రు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య తన భార్య కొమురమ్మతో కలిసి జానపద కళాకారులుగా జీవనం సాగిస్తున్నారు.
శారద తం బూరను ఆయన మీటుతూ గానం చేస్తుంటే డక్కి వాయి స్తూ కొమురమ్మ గానం చేస్తుంది. వారిద్దరూ కలసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, ఢిల్లీ, తదితర అనేక వేదికలపై ప్రదర్శన ఇచ్చారు. మొగిలయ్య మృతితో దుగ్గొండి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ కళాకారుడు రచ్చరవితో పాటు జానపద కళాకారులు తరలివచ్చి నివాళులర్పించారు. మొగిలయ్య అనారోగ్య సమస్యను గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందించారు.
అనంతరం దళిత బం ధు కింద రూ. 10 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో కూడా నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించా రు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవీంద్రభారతిలో తన తండ్రి సత్తయ్య స్మారక పురస్కారం అందించి గౌరవించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గత నెలలో రూ. లక్ష ఆర్థికసాయం అందించారు.
నిరుపేదలైన మొగిలయ్య కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి, వారి వారసత్వ వృత్తిని మరుగున పడకుండా శారద జనపద కళకారులను ప్రభుత్వం కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిళి, మాజీ సర్పంచ్ మేర్గు రాంబాబు, గుండెకారి రంగారావు, ఆరె జైపాల్‌రెడ్డి, బైగాని రఘు, కక్కెర్ల ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
బలగం సినిమా మొగిలయ్య పాట రూపంలో బతికే ఉంటారు. ఆయన పాటకు చెమర్చని కళ్లు లేవని, చలించని హృదయం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మొగిలన్న పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటిందని, మానవీయ కోణాన్ని ఆకాశమంతా ఎత్తులో నిలిపిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పేర్కొన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా బలగం పాటతో తెలంగాణ ప్రజల మనస్సుల్లో నిలిచిపోతారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నిర్మా త దిల్‌రాజు, బలగం డైరెక్టర్ వేణు తదితరులు సంతాపం తెలిపారు.
– మాజీ మంత్రి కేటీఆర్
హనుమకొండ: బలగం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య మృతికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సం తాపం తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని ఆయన పేర్కొన్నారు. మొగిలయ్య కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మొగిలయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాధిత కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొగిలయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేవరుప్పుల : మంట గలిసిన మానవ విలువలు, కుటుంబ బంధాలను గుర్తు చేసిన బలగం మొగిలయ్య మృతి తెలుగు జాతికి తీరని లోటు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తీసిన బలగం సినిమాలో మొగిలయ్య పా డిన పాట ప్రేక్షకులను ఏడిపించింది. దూరంగా ఉంటు న్న వారు, కలహాలతో సతమతమవుతున్న కుటుంబాలు ఈ పాటతో ఒక్కటయ్యారు. చిన్న గొడవలతో ఏండ్ల తరబడి మాట్లాడుకోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, కుటుంబ సభ్యులు తిరిగి దగ్గరయ్యారు. మానవ సంబంధాలు బతికున్నన్ని రోజులు మొగిలయ్య సజీవంగా ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
– మాజీ మంత్రి ఎర్రబెల్లి