ఖిలావరంగల్: త్యాగానికి, విశ్వాసానికి, మానవతా విలువలకు ప్రాతినిధ్యం వహించి, మత, సామాజిక ఐక్యతను పెంపొందించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. గ్రేటర్ వరంగల్ (Warangal) చింతల్లోని న్యూ ఈద్గాలో శనివారం ఉదయం ఈద్ నమాజును నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సమాజ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా ఈద్గాలో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. బక్రీద్ అనేది త్యాగానికి, సమాజ ఐక్యతకు ప్రతీక అన్నారు. మానవత్వాన్ని, సహాయసహకారాన్ని నేర్పే పండుగ అని పేర్కొన్నారు.
కుర్బానీ చేసి మాంసాన్ని బంధుమిత్రులతో పాటు పేదలతో పంచుకున్నారు. పండుగకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన వంటకాలు బిర్యానీ, శీర్ ఖుర్మా, మటన్ కబాబ్లతో ముస్లిం కుటుంబాల్లో ఉత్సాహం నింపాయి. ఈ కార్యక్రమంలో చింతల్ న్యూ ఈద్గా అధ్యక్షుడు ఎండీ షర్పోద్దిన్, రహమతుల్లా షరీఫ్, వక్త సుభాన్, అబ్దుల్ బారి, సిరాజోద్దీన్, ఎంఎస్ సలీం సమియోద్దీన్ తజముల్, రహమతుల్లా ఖాన్, అక్రమ్, ఎస్కే అజీమ్, అంజద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.