ములుగు రూరల్, సెప్టెంబర్1 : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు. సోమవారం ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ములుగు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను రోడ్డుపై దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బడే నాగజ్యోతి మాట్లాడుతూ ఆంధ్ర ప్రయోజనాల కోసం ఆరాట పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు అత్యంత దుర్మార్గమైనవని అన్నారు.
ఆయన చేస్తున్న కుట్రలన్నీ అసెంబ్లీ సాక్షిగా బట్టబయల య్యాయని, తెలంగాణను బలి చేసి బనకచర్ల కోసం రేవంత్‌రెడ్డి ఆడిన బాగోతం అసెంబ్లీలో వెలుగులోకి వచ్చిందని అన్నారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు కలిసి తెలంగాణను శాశ్వ తంగా దెబ్బతీసే కుట్రలకు తెరలేపారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ మొదలుకొని సీబీఐ విచారణ దాకా అన్నింట్లో ముగ్గురి హస్తం ఉందని అన్నారు.
ఘోష్ కమిషన్ నివేదికను ముందు పెట్టి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తే పార్టీ శ్రేణులే కాదు.. తెలంగాణ ప్రజలు కూడా ఊరుకోరని నాగజ్యోతి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు విజయ్‌రామ్‌నాయక్, గొర్రె సమ్మయ్య, లాలు, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్, నాయకులు గరిగె రఘు, వేములపల్లి భిక్షపతి, ఆకుతోట చంద్రమౌళి, భూక్యా మురళి, భాస్కర్, కవ్వంపల్లి బాబు, గండి కుమార్, ఇర్ప విజయ తదితరులు ఉన్నారు.