తాడ్వాయి : అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి అని ములుగు బీఆరెస్ పార్టీ ఇంచార్జి బడే నాగజ్యోతి అన్నారు. తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో ఆమె ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఇటీవల కాలంలొ అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పూర్తిగా అనర్హులకే కేటాయించారని నాగజ్యోతి మండిపడ్డారు. అసలైన లబ్ధిదారులను జాబితాలో చేర్చకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డబ్బులు చెల్లించిన వారికే కట్టాపెట్టారని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామాలలో నిరుపేదలకు అందించకుండా అనర్హులకే అందించారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను మభ్యపెట్టి పథకాలలో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోవింద్ నాయక్, రామసహాయం శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.