 
                                                            హనుమకొండ, అక్టోబర్ 31: భారత విప్లవ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన విద్యార్థి వీరులను స్మరిస్తూ విద్యాసంస్థల్లో ఈనెల 5 నుంచి 11 వరకు సంస్మరణ సభలు నిర్వహించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నరసింహారావు పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం కేయూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి.డి.ఎస్.యు) కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల హక్కుల కోసం, శాస్త్రీయ విద్య సాధన, సమానత్వ సమాజ స్థాపన కోసం పోరాడుతూ ఎంతోమంది విప్లవ విద్యార్థి వీరులు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు.
ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, దుస్సా చేరాలు, రంగవల్లి, మారోజు వీరన్న, వరహాలు, రమణయ్య లాంటి ఎంతోమంది ప్రగతిశీల విద్యార్థి నాయకులు మతోన్మాదుల దాడులకు, రాజ్యహింసకు, బూటకపు ఎన్కౌంటర్లకు, శత్రుదాడులకు తమ విలువైన నిండు ప్రాణాలు అర్పించారన్నారు. 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో పాలకులు పేదలకు ఉచితంగా విద్యను, వైద్యాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ర్టంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధిని, విద్యార్థుల సంక్షే మాన్ని పూర్తిగా విస్మరించారని, పేద విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలతో రాష్ర్ట ప్రభుత్వం చెలగా టమాడుతుందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ కేయూ అధ్యక్షుడు బి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వి.కావ్య, ఉపాధ్యక్షుడు పి.అనూష, గణేష్, చెందిన, సహాయ కార్యదర్శులు సాధన, శ్రీజ, లోకేష్, కోశాధికారి సంగీత, చారీ, యాదగిరి ఉన్నారు.
 
                            