వరంగల్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : వరంగల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్లు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణం కోసం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు. వరంగల్‌లోని నర్సంపేట రోడ్డులో ఉన్న ఆజంజాహి మిల్లు స్థలంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మొదట ఆజంజాహి మిల్లు స్థలంలో నుంచి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణం కోసం 6.16 ఎకరాలు కేటాయించింది. ఆజంజాహి మిల్లు మాజీ ఉద్యోగులకు 318 మందికి మడిపల్ల్లి, అనంతసాగర్ వద్ద కుడా అభివృద్ధి చేసిన ‘మాసిటీ’లో ప్లాట్లు కేటాయించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది.
ఆజంజాహి మిల్లు స్థలంలో నుంచి మరో 20.32 ఎకరాలను ప్రభుత్వం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణం కోసం కేటాయించేందుకు నిర్ణయించింది. దీంతో ఇక్కడ నర్సంపేట రోడ్డులో లక్ష్మీపురం, ఖిలావరంగల్ రెవెన్యూ శివారులో ఉన్న ఆజంజాహి మిల్లు స్థలం నుంచి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన భూమి మొత్తం 27.08 ఎకరాలకు చేరింది. ఈ ప్రాంతం పూర్తిగా గరీబోళ్ల గడ్డ. పేదలు నివసించే కాలనీల నడుమ ఉంది. ఇది కలెక్టరేట్‌కు అడ్డా కానుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఇందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను వరంగల్ జిల్లా ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారని ఆయన కొనియాడారు. ఈ నేపథ్యంలో స్థానికులు సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మించే ఆజంజాహిమిల్స్ స్థలంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే న రేందర్ తదితరుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
నిర్మాణానికి ప్రతిపాదనలు
జిల్లా ప్రజలందరికీ అనువుగా ఉండే వరంగల్ ఆజంజాహి మిల్లు స్థలంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. 27.08 ఎకరాల స్థలంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణం కోసం ఇటీవల ఆర్అండ్బీ అధికారులు రూ.80 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు పరిపాలన అనుమతి ఇస్తూ కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 18 ఎకరాల విస్తీర్ణంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం, 8 క్వార్టర్లు నిర్మాణం చేపట్టేందుకు రూ.80 కోట్లు మంజూరు చేసింది. కార్యాలయాల సముదాయానికి రూ.68 కోట్లు, క్వార్టర్లకు రూ.12 కోట్లు కేటాయించింది. జిల్లా కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోతోపాటు మరో నలుగురు అధికారులకు సమీకృత కార్యాలయా ల సముదాయం ఆవరణలోనే సమీకృత క్వార్టర్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపిన డిజైన్ మేరకే ఇక్కడ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మించేందుకు ఆర్అండ్బీ ఇంజినీర్లు సమాయత్తం అవుతున్నారు.
హనుమకొండ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం మాదిరిగానే..
వరంగల్ ఆజంజాహి మిల్లు స్థలంలో నిర్మించే జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం హనుమకొండలో నిర్మించిన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం మాదిరిగానే ఉండనుందని తెలిసింది. ప్లింత్ ఏరియా 1.15 లక్షల చదరపు అడుగులతో పరిపాలన అనుమతి రావడంతో ఆర్అండ్బీ ఇంజినీర్లు అంచనాలు తయారు చేసి కొద్దిరోజుల క్రితం ప్రభుత్వానికి పంపారు. నేడోరేపో ప్రభుత్వం నుంచి సాంకేతిక అనుమతి లభించగానే రూ.80 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే వరంగల్ ఆజంజాహి మిల్లు స్థలంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణ పనులకు సాధ్యమైనంత త్వరలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది.