జనగామ చౌరస్తా, అక్టోబర్ 16 : జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆంధ్ర భాషాభివర్ధిని (ఏబీవీ) డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా కల్పించింది. ఈ మేరకు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ నర్సయ్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో కేవలం ఏబీవీ డిగ్రీ కళాశాలకు మాత్రమే అటానమస్ హోదా రావడం గర్వకారణమని, ఈ విద్యా సంవత్సరం నుంచి 2028-29 వరకు కొనసాగుతుందన్నారు.
దీని వల్ల కళాశాలకు ప్రత్యేక పాలక మండలి ఏర్పడుతుందని, వారి ఆమోదంతోనే ప్రభుత్వ నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడం, మౌలిక వసతులను మెరుగుపర్చడం, కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడం, ఫీజుల నిర్ణయం, నియంత్రణ, పరీక్షల నిర్వహణ, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం కళాశాలలో 487 మంది విద్యార్థులున్నారని, అటానమస్తో వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. త్వరలో బాలుర, బాలికల హాస్టల్స్ నిర్మించి నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని నర్సయ్య కోరారు. సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బండి రాజు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.