వరంగల్, మార్చి 6: చారిత్రక ఓరుగల్లులో ఆటోమొబైల్ రంగంలో పేరున్న ప్రముఖ బ్రాండెడ్ కార్లు, బైక్ కంపెనీలు ఒకే వేదికపైకి వస్తున్నాయి. రాష్ట్ర రాజధానికే పరిమితమైన ఈ వాహనాలు ఇప్పుడు నగరంలో నిర్వహించే ఆటో షో ద్వారా అడుగు పెడుతున్నాయి. హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద నగరం, వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న ఆటో షోలో బ్రాండెడ్ కంపెనీలు తమ కార్లను ప్రదర్శించనున్నాయి.
ఇప్పటి వరకు వరంగల్ మహా నగరంలో షోరూంలు ఏర్పాటు చేయని ఆడీ క్యూత్రీ, వోల్వోఎక్స్ 90 కార్లతో పాటు జీప్ (రాంగ్లర్) కంపెనీలు వస్తున్నాయి. సుమారు 10కి పైగా కార్ల కంపెనీలతో పాటు ద్విచక్రవాహనాల కంపెనీలు ఆటో షోలో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ బ్రాండెడ్ కార్ల కంపెనీలు ఈ ఆటోషోలో భాగస్వామ్యం అవుతున్నాయి. వీటితో పాటు మోటర్ బైక్, ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఒకే వేదికపై తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తుండడంతో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆటో షో సువర్ణావకాశంగా మారనుంది. ఈ నేపథ్యంలో నచ్చిన కార్లను ఎంపిక చేసుకుని, బుక్ చేసుకునే అవకాశాన్ని ‘నమస్తే తెలంగాణ’ కల్పిస్తున్నది.
సుమారు 20 ప్రముఖ కార్లు, మోటర్ బైక్, ఎలక్ట్రిక్ కార్లు, బైక్ కంపెనీలను తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. మారుతి సుజికి, టీవీఎస్, ఎథర్, ఆడీ, స్కోడా, కియా, నెక్సా, ఎంజీ 100, యమహా, రాయల్ ఎన్ఫీల్డ్, చేతక్, గ్రీన్హోండా, సిట్రోఇన్ కంపెనీలు ఆటో షోలో స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటితో పాటు వాహన కొనుగోలుదారులకు రుణాలు అందించేందుకు డీసీసీ బ్యాంక్ తమ స్టాల్ను ఏర్పాటు చేస్తున్నది.
బ్రాండెడ్ కార్ల కంపెనీల కార్లు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్న వారు హైదరాబాద్కు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమొబైల్ రంగంలో మంచి పేరున్న కంపెనీల కార్లు, బైక్లు ఒకే చోట చూసుకునే అవకాశం కలుగుతోంది. హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో మార్చి 8,9 తేదీల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఆటో షో నగరవాసులకు ఎంతో ఉపయోగపడనుంది. నగర ప్రజలు ఆటో షోను సద్వినియోగం చేసుకొని కారు, బైక్ కొనుగోలు చేయాలనుకునే కలను సాకారం చేసుకోవాలి.