హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 8 : ‘మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో మా బతుకులు ఆగమవుతు న్నయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినంక ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నయి. సీఎం రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు ఆంధ్రాలో రూ.15 వేలిస్తున్నడు. మరి ఇక్కడ ఎప్పుడిస్తారు’ అని ఆటోడ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం ఆటోడ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 50 వేలకుగాపైగా ఆటోడ్రైవర్లు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవే శపెట్టిన ఫ్రీ బస్సుతో వారు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రూ.12 వేల ఆర్థికసాయం చేస్తామని చేతులెత్తేయడంతో ఈఎంఐలు కట్టలేక, గిరాకీ రాక, కుటుంబాన్ని పోషించుకోలేక వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
సర్కారు వచ్చి 22 నెలలు గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆటోడ్రైవర్లు మండి పడుతున్నారు. సంవత్సరానికి రూ. 12 వేలు జీవనభృతి కింద వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా రు. రాష్ట్రంలో ఇప్పటికే 100కు పైగా ఆటోడ్రైవర్లు ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, ఫైనాన్స్‌లు కట్టలేక, చితికిపోతున్నారు. తాము జేఏసీగా ఏర్పడి ధర్నాలు, నిరసనలు చేస్తూనే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ ప్రయాణానికి గిరాకీ లేక ఆటోలు మూగబోయాయని వాపోతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు ఆంధ్రాలో ఆటోడ్రైవర్లకు రూ.15 వేలు చెక్కుల రూపంలో ఇస్తున్నాడని అంటున్నారు. గురువును మించిన శిష్యుడు అనే పేరున్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మానవత్వంతో ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్న ఆటోడ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.