హనుమకొండ/భూపాలపల్లి రూరల్/ఖిలావరంగల్, జూలై 5 : బొగ్గు గనుల వేలాన్ని తక్షణమే రద్దుచేసి, సింగరేణికే నేరుగా అప్పగించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ పార్టీ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పీ స్కైలాబ్ బాబు, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తున్నదని, దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి హైదరాబాద్ కేంద్రంగానే వేలం ప్రక్రియను ప్రారంభించడం దారుణమన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్‌కు వినతిపత్రం అందజేశారు.
సీపీఎం జిల్లా నేతలు టీ ఉప్పలయ్య, వీరన్న, రాములు, సంపత్, లింగయ్య, భానునాయక్, సీపీఐ జిల్లా నేతలు శ్రీనివాస్, సదాలక్ష్మి, లక్ష్మణ్, భిక్షపతి, రవి, ఎంసీపీఐయూ జిల్లా నేతలు నాగార్జున, సావిత్రి, శ్రీనివాసరావు, మొగిలి, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి ఎన్ హంసారెడ్డి, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి గౌడగాని శివాజీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జీ దయాకర్ పాల్గొన్నారు. అలాగే, భూపాలపల్లిలోని గణేశ్ చౌక్ నుంచి అంబేదర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముష సమ్మ య్య, సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ సింగరేణి జోలికి వస్తే సహించేది లేదని, వెంటనే వేలాన్ని రద్దు చేసి, గనులను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, జీ శ్రీనివాస్, విజేందర్, క్యాతరాజు సతీశ్, రామ్ చందర్, ఆసిఫ్ పాషా, వెలిశెట్టి రాజయ్య, ఆతూరి శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు గని వేలా న్ని కేంద్ర ప్రభుత్వం ఉపసహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఏవోకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రవి, బాబు, రాచర్ల బాలరాజు, గన్నారపు రమేశ్, దామోదర కృష్ణ, ఎండీ యాకూబ్ పాల్గొన్నారు.