వరంగల్ నగరాన్ని అసాంఘిక కార్యకలాపాలు వణికిస్తున్నాయి. సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అధికార పార్టీ నేతల కుటుంబ సభ్యులు, అనుచరుల దందాలు పెరిగిపోతున్నాయి.. విచ్చల విడిగా గంజాయి స్మోకింగ్.. మద్యం మత్తులో దాడులు.. నిత్యకృత్యమైన గొడవలతో గ్రేటర్లో అసలేం జరుగుతోంది? అనే ప్రశ్న నగర వాసులను వేధిస్తున్నది. దీనికి తోడు పోలీసు నిఘా వ్యవస్థ నిద్ర పోతున్నది.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో శాంతి భద్రతలు అదుపుతప్పగా.. రోజు రోజుకు పెరుగుతున్న నేరాలకు తోడు గన్ కల్చర్ వరంగల్‌లో వేళ్లూనుకోవడం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.
కొద్ది కాలంగా వరంగల్ నగరంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనకు గురిచేస్తున్నా యి. శాంతిభ్రదతలు అదుపు తప్పడంతో నిత్యం గొడవలు, దాడులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌కే పరిమితమైన గన్ కల్చర్ ఇప్పుడు వరంగల్‌కు పాకడం చర్చనీయాంశంగా మారింది. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఎవరికి వారుగా..వ్యవహరించడం, కొందరు అక్రమ సంపాదనకు మరిగి విధులను మరవడంతో నగరంలో లా ఆర్డర్ ట్రాక్ తప్పిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పనిచేయడం, వారి సిఫార్సు మేరకే కేసులు నమోదు చేయడంతో బాధితులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు వరంగల్ నగరం, శివారు ప్రాంతాల్లో భూవివాదాల్లో జోక్యం చేసుకోవడం, సెటిల్మెంట్లు చేయడం లాంటి దందాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఆర్థిక లావాదేవీల కేసు విషయంలో ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కేయూసీ పోలీసుస్టేషన్లో అందరు చూస్తుండగానే ఓ యువకుడిపై దాడికి పాల్పడిన ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే మరో ఎమ్మెల్యే కుమారుడు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తానని ఒకరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని పని చేయలేదు. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని సదరు వ్యక్తి అడగడంతో తన అనుచరులతో అతడిపై దాడిచేయించడంతో చేయి విరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక యూత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో లీడర్ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ భూ బాధితులను బెదిరిస్తున్నట్లు తెలిసింది.
వరంగల్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో గంజాయి గ్యాం గ్లు రెచ్చిపోతున్నాయి. రాత్రివేళ బంధం చెరువు కట్ట, హంటర్‌రోడ్డు రేల్వే ట్రాక్ పరిసర ప్రాంతాలు, రెడ్డిపురం కెనాల్ కట్ట, ఖిలావరంగల్-దూపకుంట ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణ ప్రాంతం, శ్మశాన వాటికలు తదితర నిర్మానుష్య ప్రాం తాల్లో గంజాయి సేవిస్తూ మత్తులో దాడులకు తెగబడుతున్నారు. ఇటీవలె మట్టెవాడ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రముఖ మద్యం వ్యాపారి తమ్ముడు కుమారుడు ఇం ట్లోనే గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు సైతం గంజాయి స్మోక్‌కు అలవాటుపడుతున్నారు. అలా గే పలువురు మందు బాబులు మద్యం మత్తులో గొడవలు, దాడులకు పాల్పడుతున్నా రు.
కొద్ది రోజుల క్రితం మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు గొడవల కారణంగా ప్రత్యర్థి వర్గం చేతిలో హత్యకు గురయ్యాడు. ఇటీవల ఎనుమాముల మా ర్కెట్ సమీపంలోని ఓ బార్లో నలుగురు వ్యక్తులు ఒకరిపై తీవ్రంగా దాడిచేశారు. మిల్స్‌కాలనీ, మట్టెవాడ, ఇంతేజార్గంజ్, హనుమకొండ, సుబేదారి, కాజీపేట, కేయూసీ, హసన్‌పర్తి, మడికొండ, గీసుగొండ, మామునూరు, దామెర, ఎనుమాముల పోలీసు స్టేషన్ల పరిధిలో మత్తులో దాడులు చేయడం నిత్యకృత్యం గా మారింది. అలాగే మండిబజార్‌లో తెల్లవారుజాము వరకు తెరిచి ఉంచే ఓ బిర్యానీ సెంటర్ వద్ద కూడా తరచూ మద్యం మత్తు లో గొడవలు జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఆయా పోలీస్ స్టేషన్లలోని పోలీసులు రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించాలి. ప్రధాన రోడ్లపై సంచరించే వ్యక్తులు, అనుమానితులను ఆరా తీయడంతోపాటు ఏదైనా సంఘటన జరిగితే స్థానిక పోలీసులను అలర్ట్ చేయాలి. సమస్యత్మాక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏసీపీ స్థాయి అధికారి నైట్ పెట్రోలింగ్‌ను పర్యవేక్షించాలి. అయితే పెట్రోలింగ్ సిబ్బంది మాత్రం నామమాత్రంగా డ్యూటీ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తొమ్మిది పోలీసు స్టేషన్లు, పర్యవేక్షణ ఉన్నతాధికారులుగా సీపీ, డీసీపీ, శాంతిభద్రతల పరిరక్షణలో నలుగురు ఏసీపీలు, తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు, 30 మందికి పైగా ఎస్సైలు, 500 మంది సిబ్బంది ఉన్నప్పటికీ దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, చోరీ ఘటనలు ఎక్కువ జరుగుతున్నట్లు పోలీసు రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.
అలాగే పోలీసు నిఘా వ్యవస్థ నిద్రమత్తులో జోగుతుండడంతోనే నేరాల సంఖ్య పెరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే పోలీసులు అలర్ట్ అవుతున్నారే తప్ప నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అవినీతికి పాల్పడిన, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తుండడంతో ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.