నర్సింహులపేట, ఫిబ్రవరి 21: కక్ష పూరితంగా చేసిన దాడి ఘటనలో గాయపడిన వ్యక్తిపైనే కేసు నమోదు చేశారని చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి శుక్రవారం తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నర్సింహుల పేట మండలం పెద్ద నాగారం స్టేజి జీపీ శివారు హాజ్యతండా వాసి భూక్య రెడ్డి మాట్లాడుతూ ఈనెల18న ఉదయం వరి పొలానికి మోటర్ పెట్టి తిరిగి ఇంటికి వస్తూ నర్సరీ వద్ద మోరీపై తమ తండాకు చెందిన నలుగురం కూర్చొని కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు వేయలేదని, తీన్మార్ మల్లన్న బీసీ కులం గురించి మాట్లాడుకున్నాం అని తెలిపారు. దీంతో ఓ వ్యక్తి తమ కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అసభ్యజాలంతో తిడుతూ నన్ను రాయితో తలపై తీవ్రంగా గాయ పరచడంతో కింద పడిపోయానని, అది చూసి పారిపోయాడని చెప్పాడు.
దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని భూక్యారెడ్డి చెప్పాడు. చికిత్స కోసం తనను జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానకు పంపితే, తలపై ఐదు కుట్లు వేశారన్నాడు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో ఒత్తిడితో ఎటువంటి విచారణ చేయకుండానే తానే ఆ వ్యక్తిని కొట్టానని తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించాడు. తనపై అక్రమ కేసు నమోదు వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందన్నాడు. ఎస్ఐ కూడా కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించాడు. దీనిపై ఎస్ఐ వివరణ కోరగా ఇద్దరు పరస్పరం దాడులు చేశారని ఫిర్యాదు చేశారన్నారు. చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు. క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత వైద్యులు ఇచ్చే నివేదికకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అని చెప్ప్పారు.