వరంగల్ చౌరస్తా, ఆగస్టు 9 : ఎంజీఎంలో దారుణం జరిగింది. మృతశిశువును వీధికుక్కలు పీక్కుతిన్న ఘటన అందరినీ కలచివేసింది. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే అత్యవసర విభాగం వద్ద శుక్రవారం సా యంత్రం గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లగా కుక్కలు నోట కరుచుకొని చీల్చడంతో ఆ శిశువు ఆడ, మగ అనే ఆనవాళ్లు కూడా తెలియని స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న వైద్యాధికారులు మృతదేహాన్ని పరిశీలించి శిశువు వయ స్సు మూడు లేదా నాలుగు రోజులుంటుందని చెప్పగా, ఘటనపై కలెక్టర్ సత్యశారద విచారణకు ఆదేశించగా తహసీల్దార్ ఇక్బాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కాగా ఎంజీఎంలో ఇంత జరుగుతున్నా సరైన నిఘా వ్యవస్థ, పర్యవేక్షణ లేకపోవడమే కారణమని తెలుస్తోంది.
ఎంజీఎం అత్యవసర విభాగాన్ని ఆనుకొని ఉన్న పోలీ స్ ఔట్‌పోస్టు పక్కనే గుర్తుతెలియని వ్యక్తులు శిశువు మృతదేహాన్ని వదిలివెళ్లారు. మృతదేహాన్ని గుర్తించిన కుక్కలు నోట కరుచుకొని ఉండడాన్ని స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న ఔట్ పోస్టు సిబ్బంది గమనించి వైద్యాధికారులు, స్థానిక మట్టెవాడ పోలీసులకు సమాచారం చేరవేశారు.
వెంటనే స్పందించిన ఎంజీఎం వైద్యాధికారులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి శిశువు వయస్సు కేవలం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే ఉంటుందని, శిశువు జననం హాస్పిటల్లో జరిగినట్లుగానే ఉందని, ప్రసవ సమయంలో వైద్యం తెలిసిన వ్యక్తులు సేవలందించిన ఆనవా ళ్లు కనిపిస్తున్నాయని, చేతికి స్లై న్ క్యాన్లా, బొడ్డుకు క్లిప్ కూడా అలానే ఉందని తెలిపారు. అయి తే అత్యవసర వైద్యసేవల కోసం వచ్చి శిశువు మృతిచెందిన విషయాన్ని గుర్తించి ఇక్కడే వదిలి వెళ్లి ఉంటారని వైద్యాధికారులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిశువు మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి మార్చురీలో భద్రపరిచారు. కుక్క లు శరీర భాగాలను నోటితో చీల్చడం వల్ల శిశువు ఆడ, మగ అనేది గుర్తించలేని స్థితిలో మృతదేహం ఉందనారు.
ఎంజీఎం నిఘా, పర్యవేక్షణ వైఫల్యం మరోమారు బయటపడింది. పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉన్నా అధికారులు అందుకు తగిన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఉద్యోగులు, సిబ్బంది అంటున్నారు. శుక్రవారం ఔట్‌పోస్టు సిబ్బంది డ్రిల్‌లో భాగంగా సాయంత్రం సుమారు 4గంటల సమయంలో పరిసరాలను శుభ్రం చేసిన సమయంలో అక్కడ ఎలాంటి వస్తువులు గానీ, శిశువు ఆనవాళ్లు గానీ గుర్తించలేదు.
ఎంజీఎంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థ పనిచేయకపోవడంతో నేడు ఈ శిశువు ఎవరు తీసుకొచ్చారనే విషయాన్ని గుర్తించలేకుండా పోయిందని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై వరంగల్ కలెక్టర్ సత్యశారద స్పందించి తహసీల్దార్ ఇక్బాల్‌ను విచారణకు ఆదేశించారు. ఈమేరకు ఆయన ఎంజీఎంకు వెళ్లి వివరాలు సేకరించారు.