కాజీపేట, జూన్ 7 : కాజీపేటలోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుంటున్న ఇద్దరు మహిళలను మాటలతో మభ్యపెట్టి కార్డుతో ఉడాయించి, మరో ఏటీఎంలో డబ్బులను డ్రా చేసుకుని జల్సాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యానగర్‌కు చెందిన నిర్మల తన అక్క కూతురుతో కలిసి గురువారం సాయంత్రం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లింది. నగదును డ్రా చేయడానికి ప్రయత్నించగా డబ్బులు రాలేదు. అప్పటికే ఆ ఏటీఎం కేంద్రంలో ఉన్న ముఠా సభ్యులు ఆ మహిళలను మాటలతో నమ్మించి కార్డును తీసుకుని డ్రా చేస్తున్నట్లు నటించారు.
కార్డును మార్చి వేరే కార్డును చేతిలో పెట్టారు. మహిళ మరో ఏటీఎం కేంద్రంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించగా రాలేదు. ఇంతలో నిర్మల సెల్‌ఫోన్‌కు రూ.45 వేలు డ్రా అయినట్లు మేసేజ్ రావడంతో కంగుతున్నది. వెంటనే ఆమె తమ చేతిలో ఉన్న కార్డును చూసి తాము మోసపోయినట్లు తెలుసుకుని బ్యాంక్ మేనేజర్‌కు సమాచారమిచ్చి ఖాతాను స్తంభింపజేసింద. సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం వేట ప్రారంభించగా విష్ణుపురి రోడ్డులో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. నిందితుడు మద్యం తాగి ఉండడంతో పోలీసులు ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఈ కేసులో మరో ఇద్దరికి సంబంధం ఉన్నదని సీఐ సుధాకర్‌రెడ్డి చెప్పారు.