హనుమకొండ చౌరస్తా, జూన్ 6 : హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. వరంగల్, హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. అండర్-8, 10, 12, బాయ్స్ అండ్ గర్ల్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, అండర్-14, 16, 18, 20 బాయ్స్ అండ్ గర్ల్స్ 100, 400 మీటర్స్ పోటీలు నిర్వహించగా, సుమారు 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటిరోజు 100, 400 మీటర్ల రన్నింగ్, హైజంప్, లాంగ్‌జంప్, షార్ట్ఫుట్ పోటీలు నిర్వహించారు. ప్రత్యేక అతిథులుగా హాజరైన వరల్డ్ చాంపియన్ దీప్తి, ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ సాయిసంగీత, ఏషియన్ గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్ అగస్ట్రా నందిని క్రీడాకారులను ఉత్తేజపరిచారు. క్రీడాకారులతో పాటు తల్లిదండ్రులు వారితో ఫొటోలు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ క్రీడా పోటీల్లో బంగారు పతకమే లక్ష్యంగా క్రీడాకారులు పరుగులు తీశారు. కార్యక్రమంలో సెక్రటరీ సారంగపాణి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, ఉపాధ్యక్షుడు ఐలి చంద్రమౌళిగౌడ్, ములుగు జిల్లా సెక్రటరీ పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్ శ్రీమన్ పాల్గొన్నారు.
తెలంగాణలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పేదింటికి చెందిన నాకు రాష్ట్ర సర్కారు ఇంటితో పాటు ఉద్యోగం ఇవ్వాలి. కోచ్ నాగపురి రమేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రం పేరు ప్రపంచానికి చాటి చెప్పాను. అనేక పతకాలు సాధించి పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చాను. ఇటీవల జపాన్‌లో జరిగిన 400 మీటర్స్ టీ20లో వరల్డ్ చాంపియన్‌తో పాటు వరల్డ్ రికార్డు సాధించాను. జేఎన్‌ఎస్‌లోని సింథటిక్ ట్రాక్ క్రీడాకారులకు ఉపయోగకరంగా మారింది.
దుబాయ్‌లో జరిగిన 4X4 రిలేలో ఏషియన్ గోల్డ్ మెడల్ సాధించాను. చాలా సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రీడల్లో రాణించి బంగారు పతకాలు సాధిస్తా. అందుకోసం చాలా శ్రమిస్తున్నాను. కోచ్ ప్రోత్సాహంతో మెళకువలు నేర్చుకుని రాష్ర్టానికి ఇంకా పతకాలు సాధిస్తా. యువ క్రీడాకారులను ప్రోత్సహించాలి.
చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో హెప్టాథ్లాన్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించడమే నా లక్ష్యం. క్రీడారులను ఆర్థికంగా ఆదుకోవాలి. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరింత ప్రతిభ కనబర్చి పతకాలు సాధిస్తారు.