పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ సీజన్‌కైనా రంది లేకుండా సాగునీరందడంతో రైతన్న ధీమాగా పంటలు వేశాడు. పుష్కలంగా ఉన్న భూగర్భజలాలు, ప్రాజెక్టుల నుంచి వచ్చే నీళ్లతో పుట్లకొద్దీ పంటలు పండించాడు. కానీ ఈసారి సకాలంలో సాగునీరందక దిక్కుతోచని రైతన్నను కాంగ్రెస్ సర్కారు మాత్రం పట్టించుకోలేదు. ప్రాజెక్టుల నుంచి చెరువులకు, తద్వారా పంటలకు నీళ్లు విడుదల చేసే అవకాశమున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
సర్కారు పట్టింపులేమితో సాగునీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పంటల సాగు కూడా తగ్గింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలే రైతులకు దిక్కయ్యాయి. సీజన్ చివరి దశకు చేరిన సమయంలో ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ చెరువులు వాన నీటితో నిండడంతో పంటలకు ఊపిరి పోసినట్లయింది. అయితే వరుణుడు భరోసా ఇచ్చినా.. పంట సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
– వరంగల్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి నిర్వహణ అయోమయంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల నుంచి చెరువులు, పొలాలకు నీళ్లు సరఫరా చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ పరిస్థితులతో గతేడాది యాసంగి పంటల సాగు సరిగా సాగలేదు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఎక్కువ ప్రాంతాల్లో వరి నాట్లు వేయలేదు. చెరువులకు నీటి సరఫరా లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. బావులు ఎండిపోయాయి. సాగునీటిపై భరోసా లేకపోవడంతో వానకాలంలోనూ పంటల సాగు ఆశించిన మేర లేదు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ వైఫల్యంతో పంటల సాగు తగ్గింది. సాగు చేసిన పంటలకు భరోసా లేకుండా పోయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పంటలకు ఊపిరిపోశాయి. మహబూబాబాద్ జిల్లాల్లో అత్యధికంగా వానలు పడ్డాయి. హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోనూ వారం రోజులు వానలు పడడంతో రైతులకు ఊరట కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయకున్నా ప్రకృతి కరుణించడంతో వానలు వచ్చి చెరువులు నిండాయి. తాజా వానలతో వానకాలం పంటలకు భరోసా దక్కింది.
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆరు జిల్లాల్లో ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టులతోనే సాగునీరు సరఫరా అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా నిర్వహణ లేకుండా పోయింది. వానకాలం పంటల సీజన్ ముగింపు దశకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి వానల వరకు సాగునీటి సరఫరాపై దృష్టి పెట్టలేదు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు సరఫరా చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది వానకాలం పంటల సాగు తగ్గింది. సాగుచేసిన పంటలకు నీళ్లు సరిగా లేక రైతులు ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో ప్రకృతి అనుకూలించి వానలు పడడంతో రైతులకు భరోసా కలిగింది.
వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలను సాగునీటి శాఖ పరంగా వరంగల్, ములుగు యూనిట్లుగా చీఫ్ ఇంజనీరు ఆఫీసులు ఉన్నాయి. వరంగల్ యూనిట్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో వరంగల్, మహబూబాబాద్, జనగామ సర్కిళ్లు.. ములుగు యూనిట్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో ములుగు, నర్సంపేట సర్కిళ్లు ఉన్నాయి. వరంగల్, ములుగు చీఫ్ ఇంజినీర్ యూనిట్ల పరిధిలో 4,576 చెరువులు ఉన్నాయి. ఇటీవలి వానలతో 3,280 చెరువులు అలుగు పోస్తున్నాయి. మరో 954 చెరువులు పూర్తిగా నిండి ఉన్నాయి.
134 చెరువులు 75 వరకు నీళ్లు ఉన్నాయి. 24 చెరువులు సగం వరకు, 34 చెరువులు పావు వంతు నిండి ఉన్నాయి. సీజన్లో తీవ్రస్థాయిలో వానలు వచ్చిన మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి. వీటిలో పది వరకు చెరువుల కట్టలు తెగిపోయాయి. మహబూబాబాద్ ఇరిగేషన్ సర్కిల్లో మొత్తం 674 చెరువులు మత్తడి పడుతున్నాయి. వరంగల్ సర్కిల్లోని 791 చెరువుల్లో 544 చెరువులు మత్తడి పడుతున్నాయి. ఈ సర్కిల్ పరిధిలోని 13 చెరువులు పావు వంతు మాత్రమే నిండి ఉన్నాయి.
జనగామ సర్కిల్ పరిధిలో వానలు తక్కువగా ఉ న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల పరిధిలోని సాగునీరు సరఫరా చేయకపోవడంతో అన్ని చెరువులు నిండలేదు. ఈ సర్కిల్ పరిధిలోని 966 చెరువుల్లో 430 మత్తడి పోస్తున్నాయి. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చెరువులకు పూర్తి స్థాయి నీళ్లు రాలేదు. ఈ డివిజన్ పరిధిలోని 586 చెరువుల్లో 234 చెరువులు మాత్రమే నిండి ఉన్నాయి.