రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘జెమిని ఆడిబిల్స్ ఆయిల్’ సంస్థ సౌజన్యంతో హనుమకొండ ఎక్సైజ్‌కాలనీలో 2020 జూన్ 29న అప్పటి సీపీ డాక్టర్ వీ రవీందర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ‘భరోసా సెంటర్’ను ప్రారంభించారు. అఘాయిత్యాలకు గురైన బాధితులకు ఈ సెంటర్ ఎంతగానో భరోసా ఇస్తున్నది. బాధితులు ఆశ్రయం పొందేందుకు, చదువుకునేందుకు, ఉపాధి పొందేందుకు తోడ్పాటునందిస్తున్నది. సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 113 మంది బాధితులు తక్షణ సేవలు పొందారు. లైంగికదాడులకు గురైనవారిలో సామాన్యుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వైద్యులు సైతం ఉన్నారు.
లైంగిక దాడులకు గురైన, వేధింపులకు గురైన బాధితులు ఎవరైనా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా లేదా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్లినా లేదా నేరుగా సెంటర్‌కు వెళ్లినా ఇక్కడ అన్ని విధాలా సహాయం అందిస్తున్నారు. కేంద్రంలో ఐదు రకాల సేవల విభాగాలు ఉన్నాయి. తొలుత బాధితురాలి నుంచి సెంటర్ సపోర్ట్ పర్సన్ యూనిక్ ఐడీ విభాగంలో (బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచుతారు) వివరాలు నమోదు చేసుకుంటారు. తర్వాత పోలీస్ ఆఫీసర్ (మహిళా పోలీస్ అధికారి, సీఐ స్థాయి) బాధితురాలి వాంగ్మూలం, 161 స్టేట్మెంట్ తీసుకుంటారు. తర్వాత జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్లను ఆన్‌కాల్ బేస్ పద్ధతిలో వెంటనే పిలిపించి సెంటర్లోనే బాధితురాలికి వైద్య పరీక్షలు చేయిస్తారు. అనంతరం మానసిక నిఫుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. బాధితురాలిని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయకుండా కూడా కౌన్సెలింగ్ ఇస్తారు. తర్వాత న్యాయవాది (లీగల్ సపోర్ట్ ఆఫీసర్ ) కోర్టులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా లీగల్ రిపోర్ట్ తయారు చేస్తారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాధిత బాలికలు చదువుకునేందుకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పిస్తారు. ఏ దిక్కూలేని వారికి స్వధార్ హోమ్‌లో ఆశ్రయం కల్పిస్తారు. వృత్తిపరమైన పనులు చేసుకొని ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తారు. 18 ఏళ్ల లోపు ఉన్న బాధిత ఆడపిల్లలకు రూ.లక్ష, 18 ఏళ్ల పైన మహిళలకు రూ.50వేలు, ఎస్సీ, ఎస్టీ బాధితులకు రూ.5లక్షల నుంచి రూ.8లక్షల దాకా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తారు.
నిందితులకు చట్టపరంగా శిక్షపడేలా భరోసా సెంటర్ తరఫున కృషి చేస్తారు. బాధితుల నుంచి తగిన ఆధారాలు సేకరించి నివేదిక తయారు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టుకు అందిస్తారు. బాధితులు మైనర్లయితే పోక్సో చట్టం ద్వారా, 18 ఏళ్లు దాటినవారైతే లైంగికదాడి చట్టం కింద నిందితులకు శిక్ష పడేలా చూస్తారు.
లైంగికదాడి, వేధింపులకు గురైన వారిలో సామాన్యుల నుంచి ఉన్నత చదువులు చదివినవారి దాకా ఉన్నారు. వరంగల్ నగరానికి చెందిన ఓ అనాథ బాలిక వరుసకు పిన్ని ఇంట్లో ఉంటుండగా దగ్గరి బంధువు కన్నేశాడు. అతడికి భార్య లేకపోవడంతో ఆమె పిన్ని సహాయంతో దురాగతానికి ఒడిగట్టాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసి భరోసా సెంటర్ నిర్వాహకులు బాలికను చేరదీసి వైద్య సేవలు అందించారు. డెలివరీ అయిన తర్వాత పాపను శిశు గృహానికి దత్తత ఇచ్చారు. బాధితురాలిని దూర ప్రాంతంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలకు పంపించారు. వరంగల్‌లోనే ఆరేళ్ల సొంత బిడ్డపై కన్నేసిన 35 ఏళ్ల తండ్రి (వృత్తి ఆటో డ్రైవర్) కొన్ని రోజులుగా రాత్రి సమయంలో లైంగికంగా వేధిస్తుండడంతో అతడి భార్య గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో భరోసా సెంటర్లో పాపకు, తల్లికి మానసికంగా ధైర్యం కల్పించారు. ఇక తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారి న ఓ బాలిక(16) అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుండగా వరుసకు బాబాయ్(45) కన్నేశాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయం అమ్మమ్మకు చెప్పడంతో నిందితుడు రాజీకి ప్రయత్నం చేశాడు. అవమానం భరించలేక బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. అమ్మమ్మ ధైర్యంతో చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేయగా అక్కడి నుంచి భరోసా సెంటర్‌కు పంపించారు. ఈ సెంటర్లో ఆమెకు అన్నివిధాలా సాయం అందించారు.
మరో ఘటనలో ఇద్దరు పదో తరగతి క్లాస్మేట్స్. ప్రేమికుడు ఆటోడ్రైవర్ కావడంతో ఉన్నత చదువులు చదవాలని పట్టుబట్టి బాధితురాలే ఖర్చు భరించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మి అతడితో లైంగికంగా దగ్గరైంది. అతడు హైదరాబాద్‌లో పీజీ చేసి, అక్కడే నెలకు రూ.50వేల ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. బాధితురాలు కూడా అదే స్థాయిలో ఉద్యోగంలో చేరింది. ఇంటి పెద్దలను ఒప్పించి రూ.15లక్షల కట్నంతో పెళ్లి కూడా కుదుర్చుకున్నారు. రూ.5లక్షలు ముందస్తుగా తీసుకున్న అతడు వేరే అమ్మాయితో రూ.20లక్షల కట్నంతో పెళ్లికి సిద్ధపడ్డాడు. విషయం తెలిసి బాధితురాలు భరోసా సెంటర్‌ను ఆశ్రయించగా ఇక్కడ ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి మోసపూరిత ప్రేమ వ్యవహారం నుంచి బయటపడేలా చేశారు. మరో సంఘటనలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన యువతి బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లగా అక్కడ బాగా పరిచయం ఉన్న అబ్బాయితో చనువుగా ఉంది. అతడు కూల్ డ్రింక్ తాగుదామని పక్కనే ఉన్న ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి లైంగిక దాడి చేశాడు. మరో వైద్యురాలు కూడా ప్రేమ పేరుతో మోసపోయింది. తనతోపాటు డాక్టర్ చదివిన వ్యక్తి రెండేళ్లపాటు ఆమెను వాడుకొని పెళ్లి మాట ఎత్తగానే ‘నీది వేరే కులం’ అని ముఖం చాటేసి వేరే అమ్మాయితో పెళ్లి కుదర్చుకొని విదేశాలకు వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు పోలీస్ స్టేషన్ ద్వారా భరోసా సెంటర్ సపోర్ట్ తీసుకుంది. ఓ న్యాయవాది తన క్లాస్‌మేట్‌ను నమ్మి ప్రేమించింది. అతడు లోబర్చుకొని మోసం చేశాడు. ఇలా ఉన్నత విద్యావంతులు కూడా ప్రేమ పేరుతో మోసపోయి న్యాయం కోసం భరోసా సెంటర్‌ను ఆశ్రయించి తమ జీవితాన్ని చక్కదిద్దుకున్నారు.
మనుషుల్లో మృగాలు మన చుట్టూనే తిరుగుతుంటాయి.. ఆడ పిల్లలపై కన్నుపడితే చాటు పాడు చేసేందుకు కాచుక్కూర్చుంటాయి. అసహాయ స్థితిలో దొరికితే అఘాయిత్యానికి ఒడిగడుతాయి.. ఇలా అనాథే కదా ఎవరు అడుగుతారులే అనుకున్న బంధువు చేతిలో ఒకరు.. కన్నతండ్రి చేతిలో ఒకరు.. వరుసకు బాబాయి చేతిలో ఒకరు.. ప్రేమికుడి చేతిలో ఒకరు.. స్నేహితుడి చేతిలో ఒకరు ఇలా వావి వరుసలు మరిచి కాటేస్తున్న నరరూప సర్పాలకు బలైన ఎంతోమందికి హనుమకొండలోని ‘భరోసా సెంటర్’ అండగా నిలుస్తున్నది. మానసికంగా కుంగిపోయిన బాలికలు, మహిళలకు ప్రభుత్వ పరంగా రక్షణ, వైద్యం, న్యాయం, ఆర్థిక సాయం అందించేందుకు పాటుపడుతున్నది.
– సుబేదారి, ఫిబ్రవరి 24