నర్సంపేట, జనవరి 17: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీటి విషయంలో భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నర్సంపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, కాంగ్రెస్ నాయకుల ప్రకటనలతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కేసీఆర్ సర్కార్ నర్సంపేట నియోజకవర్గంలో ఇరిగేషన్ సర్క్యూట్ ప్లాన్ ప్రకారం గోదావరి జలాలను తీసుకొచ్చి నాలుగేళ్లపాటు రెండు పంటలకు సమృద్ధిగా నీరందించినట్లు గుర్తుచేశారు. ప్రత్యేక ప్రణాళికతో గోదావరి జలాలను తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు అందిస్తుందా? లేదా? అని రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సాగునీటిపై ఒక్కసారైనా అధికారులతో సమీక్షించారా అని ప్రశ్నించారు. గతంలో పూడుకుపోయిన డీబీఎం 38, 40, 48 కాల్వలను తాము పునరుద్ధరించి, కాకతీయ కాల్వపై క్రాస్ రెగ్యులేటరీ నిర్మించి సమృద్ధిగా నీరందించి పంటల సాగుకు కృషి చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరందించామని స్పష్టం చేశారు.
గతంలో పాకాలకు గోదావరి జలాలు రావడం బూటకమని కాంగ్రెస్ నాయకులు అన్నారని, ఇప్పుడు ఏ ప్రాతిపదికన తైబందీ ఖరారు చేశారో ఎమ్మెల్యే చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నప్పటికీ ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సమక్షంలో 100 శాతం తైబందీని ఖరారు చేసిన తర్వాత రైతులు నార్లు పోసుకున్నారని గుర్తుచేశారు. తక్షణమే ఎమ్మెల్యే దొంతి సాగునీటిపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షించి, రైతుల అయోమయానికి తెరదించాలని పెద్ది డిమాండ్ చేశారు. సమావేశంలో ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, బీఆర్ఎస్ ఖానాపురం మండల అధ్యక్షుడు వెంకటనారాయణ, వైస్ ఎంపీపీ ఉపేందర్‌రెడ్డి, సుధాకర్, యువరాజు పాల్గొన్నారు.