జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 8 : (నమస్తే తెలంగాణ) : నిధులున్నా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా పొలంబాట కార్యక్రమం ఆచరణలో విఫలమవుతున్నది. రైతుల పొలాలకు దారి కల్పించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పొలంబాట పనులు ముందుకు సాగడం లేదు. దీంతో రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉపాధిహామీ పథకంలో ఈ పనులు చేపట్టాల్సి ఉండగా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. జిల్లాలో పొలంబాట కార్యక్రమం ద్వారా 107 పనులను ఎంపిక చేయగా రూ. 8.18 కోట్లు మంజూరయ్యాయి. కాగా 107 పనుల్లో కేవలం 37 మాత్రమే ప్రారంభించారు. వీటిలో ఒకే ఒక్క పనిని పూర్తి చేశారు. కేవలం భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్లో మాత్రమే పొలంబాట పని కొనసాగుతున్నది. గడువులోగా పనులు పూర్తి చేయకుంటే నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసినా అధికారుల్లో ఏ మాత్రం స్పందన కనిపించడం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనతోనే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో పనులు చాలా వరకు నిలిచిపోయాయి.
చాలా కారణాలున్నాయి : బాలకృష్ణ. డీఆర్డీవో
పొలంబాట పనుల్లో జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయి. మెటీరియల్ ఖర్చు 40 శాతానికి మాత్రమే పరిమితం చేసి మిగిలిన 60 శాతం కూలీలకు ఇవ్వాలనే నిబంధనతో పాటు పొలానికి వెళ్లే దారులను మరమ్మతులు చేసేందుకు పలు చోట్ల రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పనుల్లో పురోగతి లేదు. 107 పనులు మంజూరవగా రూ. 8.18 కోట్లు కేటాయించారు. రైతులతో ప్రత్యేకంగా సమావేశమై అవగాహన కల్పించి పనులు ప్రారంభిస్తాం. నిధులు వృథాకాకుండా చూస్తాం.
నిబంధనలే అడ్డంకా ?
‘పొలంబాట’లో చేపట్టే పనుల్లో 60 శాతం కూలీలు, 40 శాతం మెటీరియల్ నిబంధన విధించింది. ఈ నిబంధనతోనే కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 107 పొలంబాట పనులు మంజూరయ్యాయి. ఇందుకుగాను రూ. 8.18 కోట్లు కేటాయించారు. పను లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, నాయకులు 37 పనులు చేపట్టారు. అయితే మెటీరియల్ ఖర్చు 40 శాతానికి మాత్రమే పరిమితం చేసి మిగిలిన 60 శాతం కూలీలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పనులు ముందుకు సాగడం లేదని చెబుతున్నారు.
నిబంధనలు మార్చడంతో పంచాయతీరాజ్ శాఖ నుంచి గత డిసెంబర్లో పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు బదిలీ చేశారు. వీటిని ఉపాధి హామీ సిబ్బందితో చేయించాల్సి ఉంది. అయితే మొరం తవ్వకాలు, రవాణా వంటి పనులను యంత్రాలతో కాకుండా కూలీలతో చేయించడం సాధ్యం కాదని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయకుంటే నిధులు వెనక్కి వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం. పొలాలకు వెళ్లే బాటలు చాలా వరకు అధ్వానంగా ఉన్నాయి. ఈ పథకం ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే దారులు మెరుగవుతాయనే రైతులు ఆశలు అడియాశలవుతున్నాయి.