కాశీబుగ్గ, ఫిబ్రవరి 19: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తింది. లక్షకు పైగా మిర్చి బస్తాలు రావడం ఈ సీజన్లో ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి. మిర్చి యార్డుతోపాటు అపరాలు, పత్తి యార్డులు, అంతర్గత రోడ్లు బస్తాలతో నిండిపోయాయి. మార్కెట్‌కు డిసెంబర్ నుంచి కొత్త మిర్చి వస్తున్నది. సీజన్ ప్రారంభంలో రెండు వేల నుంచి 10 వేల బస్తాల వరకు వచ్చాయి. సంక్రాంతి పండుగ తర్వాత మార్కెట్‌కు మిర్చి బస్తాలు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. ఈ నెలలో ప్రతి రోజూ 30 వేల నుంచి 50 వేల వరకు బస్తాలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకొని మార్కెట్‌కు ఐదు రోజులు సెలవు ఉండడంతో సోమవారం లక్షకు పైగా మిర్చి బస్తాలను రైతులు తీసుకొచ్చారు. వ్యాపారులు రాత్రి వరకు కాంటాలు నిర్వహించారు. ధర నచ్చని రైతులు తమ సరుకును కోల్డ్ స్టోరేజీలకు తరలించారు. మరికొందరు మార్కెట్లోనే భద్రపరుచుకున్నారు. ధర నిలకడగానే ఉన్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. మిర్చి రాక పెరగడంతో అడ్తి, ఖరీదు వ్యాపారులతోపాటు దడువాయి, గుమస్తా, హమాలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మార్కెట్‌కు 3 లక్షల 20 వేల క్వింటాళ్లకు పైగా మిర్చి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. తేజ రకం క్వింటాల్‌కు రూ. 21 వేలు, వండర్‌హాట్ రూ. 21,500, యూఎస్ 341 రూ. 20,500, దీపిక రకం రూ. 20 వేలు, దేశీ రకం రూ. 38,500, తాలు రూ. 8500 పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.