ఎల్కతుర్తి, ఏప్రిల్ 2 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రజతోత్సవ మహాసభ ప్రాంగణంలో ఏర్పాట్లకు అంకురార్పణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, బానోతు శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, మాజీ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మారెపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గద్దెనెక్కిన 15 నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ఖ్యాతి గడించిందని విమర్శించారు.
ఈ సభ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. చారిత్రాత్మకమైన ఈ మహాసభను ఇక్కడ నిర్వహించే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహాసభ విజయవంతం కోసం కింది స్థాయి కార్యకర్త మొదలు నాయకులంతా కృషి చేయాలని కోరారు. యువ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తేనే ఈ మహా క్రతువును విజయవంతం చేయడం సులువవుతుందన్నారు.
సభ కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామ రైతులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని దాస్యం తెలిపారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్, పోరెడ్డి రవీందర్‌రెడ్డి, ఎల్తూరి స్వామి, వెంకటేశ్‌యాదవ్, కడారి రాజు, మహిపాల్‌రెడ్డి, కోరె రాజుకుమార్, చిట్టిగౌడ్, వీరలింగం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మహా సంరంభానికి అంకురార్పణ
హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 2 : బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకకు వేదికైన ఎల్కతుర్తిలో బుధవారం మహాసభ పనుల అంకురార్పణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ నెల 27న రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో ఈ సభా ప్రాంగణం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు-సరోజినీ దంపతుల విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పనులకు శ్రీకారం చుట్టారు.
లాంఛనంగా మట్టి తవ్వగా ఉదయమే అక్కడికి భారీగా చేరుకున్న గులాబీ దళం, కేసీఆర్ అభిమాన గణం ఉత్సాహంగా పనుల్లో నిమగ్నం కావడంతో ఆ ప్రాంతమంతా మినీ సభలా మారిపోయి పండుగ వాతావరణం తలపించింది. ఎల్కతుర్తిలో సభ నిర్వహించేందుకు గత పది రోజులుగా జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌లు పలుమార్లు పరిశీలించి అధినేత కేసీఆర్‌కు వివరాలు అందజేశారు. తర్వాత పార్టీ తరపున ప్రధాన కార్యదర్శి బాలమల్లు సైతం సందర్శించి ప్రతిష్టాత్మక సభను ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు పచ్చజెండా ఊపారు.
ఈ క్రమంలో బుధవారం ప్రాంగణాన్ని చదును చేసే పనులకు మొదలయ్యాయి. దేశంలోనే భారీ సభగా నిర్వహిస్తామని చెబుతున్న నేపథ్యంలో ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభపై పరిసర గ్రామాల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఉదయం నుంచే మండలకేంద్రానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకోగా సరిగ్గా ఒంటి గంట 10 నిమిషాలకు వేదపండితులు సూచించిన స్థలంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన స్కై బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ముఖ్య నేతలకు ఎర్రబెల్లి దిశానిర్దేశం
హనుమకొండ, ఏప్రిల్ 2 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్‌పర్తి సహా 13 డివిజన్ల ముఖ్య నేతలతో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు హనుమకొండ రాంనగర్‌లోని ఆయన నివాసంలో మహాసభ విజయవంతంపై వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డివిజన్ల ముఖ్య నాయకులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మండల ఇన్చార్జీలు, మండల కోఆర్డినేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్, యువత పాల్గొన్నారు.
సభను విజయవంతం చేయాలి
ఆత్మకూరు, ఏప్రిల్ 2 : ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండలోని ఆయన నివాసంలో నియోజకవర్గ స్థాయి, సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా వాటిని అమలుచేయడం లేదన్నారు.
అందుకే రేవంత్ సర్కారుపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు భయపడే స్థానిక సంస్థ ఎన్నికలకు పోవడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు తిరిగిలేని పరిస్థితుల్లో ఉన్నారని స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కొంతకాలం ఓపికతో, సమన్వయంతో ఉండాలన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ ఉండగా ఉంటుందన్నారు.
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. రేపటి నుంచి ఆయా మండలాల సమన్వయ కమిటీ సభ్యులు గ్రామాల్లో వెళ్లి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏ గ్రామం నుంచి ఎంత మంది పార్టీ శ్రేణులు సభకు వస్తున్నారో, కావాల్సిన వాహనాలు, ఎన్నో జాబితా సిద్ధం చేసి ఇవ్వాలని కోరారు. సమావేశంలో పరకాల, పరకాల మున్సిపాలిటీ, ఆత్మకూరు, దామెర, నడికూడ, సంగెం, గీసుగొండ, గ్రేటర్ పరిధిలోని 15, 16, 17 డివిజన్లలోని సమన్వయకమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
25 ఏండ్ల చరిత్ర ఆవిష్కృతం
ఎల్కతుర్తిలో నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభలో 25 ఏండ్ల పార్టీ చరిత్ర ఆవిష్కృతం కానుంది. దేశంలోనే అతిపెద్దదిగా ఎల్కతుర్తి సభ కీర్తి గడించబోతున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అధోగతి వైపు సాగుతున్నది. ప్రస్తుత పాలకుల పుణ్యమా అని అటు సాగు, ఇటు తాగు నీళ్లకు ప్రజలు అల్లాడిపోతున్నారు. కేసీఆర్‌ను వదలుకొని తాము తప్పు చేశామని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాతే హైదరాబాద్, వరంగల్‌తో పాటు గ్రామీణ ప్రాంతాలు బాగుపడ్డాయి. ఇప్పుడు చూద్దామన్నా అభివృద్ధి పనుల జాడ కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నీ మరిచిపోయింది. రజతోత్సవ సభకు లక్షలాదిగా జనం తరలివచ్చి ఈ ప్రభుత్వానికి హెచ్చరికను పంపాలి.
దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈ మహాసభ జరగబోతున్నది. మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే దిశగా మనందరం కలిసిపోరాడాల్సిన అవసరం ఉంది. రజతోత్సవ సభ ఉమ్మడి వరంగల్ పరిధిలో జరగడం సంతోషించాల్సిన విషయం. సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. హనుమకొండ, ఎల్కతుర్తి పరిసర ప్రాంత ప్రజలు అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలి. ఇంత పెద్ద సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి
సమష్టి కృషితో సక్సెస్ చేద్దాం..
ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ సమావేశమై అనేక సూచనలు చేశారు. వారు ఇచ్చిన సూచనలను పాటించి సభ విజయవంతానికి అందరం సమష్టిగా కృషి చేద్దాం. గతంలో అనేక సభలను విజయవంతం చేసిన అనుభవం మనకుంది. అదే అనుభవంతో ఈ రజతోత్సవ మహాసభను సైతం కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిద్దాం.
– తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ
అతిపెద్ద సభగా కీర్తికెక్కాలి
ప్రపంచంలో ఐదు అతి పెద్ద సభలు జరిగితే, అందులో ఒకటి గతంలో మనం వరంగల్‌లో నిర్వహించాం. ఇప్పుడు నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభను ప్రపంచంలోనే అతిపెద్ద సభగా కీర్తికెక్కించాలి. పార్టీ తరపున మన నాయకుడు ఏ పిలుపునిచ్చినా దానిని క్రమశిక్షణతో అమలు చేసే చరిత్ర వరంగల్ జిల్లాకు ఉంది.
అదే క్రమంలో ప్రస్తుత సభను కూడా విజయవంతం చేద్దాం. తెలంగాణ సాధనలో ఓరుగల్లు పాత్ర కీలకం. ప్రస్తుత సభ కోసం ప్రతి ఒక్కరూ కథానాయకులై కదలిరావాలి. తెలంగాణను తెర్లు చేస్తున్న దొంగల్ని తరిమికొట్టే రోజు వచ్చింది. ఈ సభకు ప్రజలు కూలీ పని చేసుకుంటూ స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఉత్సాహం చూపుతుండడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
అందరి సహకారం కావాలి
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహించడం గర్వించదగ్గ పరిణామం. ఈ సభ కోసం ఇప్పటికే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఇదే క్రమంలో మిగతా విషయాల్లోనూ అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి. సభా ప్రాంగణంతో పాటు పార్కింగ్ స్థలం కోసం కూడా మా భూములు వాడుకోండి అంటూ ఎన్వోసీలపై సంతకాలు చేసి ఇచ్చిన ఎల్కతుర్తి, చింతలపల్లి, ఇందిరానగర్, గోపాల్పూర్ రైతులకు కృతజ్ఞతలు. సభ పూర్తయ్యే వరకు కార్యకర్తలతో పాటు నాయకులు అప్రమత్తంగా ఉండి విజయవంతం చేయాలి.
– వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
ఎల్కతుర్తిలో నిర్వహించబోయే రజతోత్సవ మహాసభకు వచ్చే ప్రజల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. మూడు జాతీయ రహదారులకు కేంద్ర బిందువుగా ఉన్న ఎల్కతుర్తిని బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ సభ కోసం ఎంపిక చేశారు. సభా ప్రాంగణం కాకుండా మూడు వైపులా పార్కింగ్ కోసం 1000 ఎకరాల స్థలాన్ని సేకరించాం. రహదారులు కూడా కొత్తగా వేయడంతో పాటు ప్రజలు సభా ప్రాంగణానికి సులువుగా నడుచుకుంటూ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎండలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలకు 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లతో పాటు 10 లక్షల వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచుతున్నాం. సభ విజయవంతం కోసం వివిధ కమిటీలు వేస్తున్నాం.
– పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ