కరీమాబాద్, అక్టోబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం పండుగలు, ఉత్సవాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో జరిగే అన్ని రకాల ఉత్సవాలకు ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నది. ఇందులో భాగంగా విశాలమైన ఉర్సు రంగలీలా మైదానం నరకాసుర వధకు వేదిక కానుంది. దీపావళి పండుగ విశిష్టతను తెలియజేసేందుకు ఇక్కడ ఏటా నరకాసుర వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పటాకుల మోత.. ఆకాశంలో తారాజువ్వల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో కళాకారులు చేసే కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. ఆదివారం సాయంత్రం నరకాసుర వధ నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రంగలీల మైదానంలో నిర్వహిస్తున్న నరకాసుర వధను తిలకించేందుకు 19 ఏళ్లుగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారు.
ఏర్పాట్లలో నిమగ్నమైన కమిటీ సభ్యులు
దాతల సహకారం.. కమిటీ సభ్యుల కృషితో నరకాసుర వధ ఏటా విజయవంతంగా కొనసాగుతున్నది. రంగలీలా మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కమిటీ విస్తృత ప్రచారం చేస్తున్నది. కార్యక్రమాన్ని తిలంకించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు శాఖ సైతం బందోబస్తు కోసం చర్యలు చేపడుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ లైట్ల అలంకరణ, పారిశుధ్య పనులు, రోడ్ల మరమ్మతు పనులను అధికారులు చేపడుతున్నారు. నరకాసుర వధకు 56 అడుగుల భారీ ప్రతిమ ముస్తాబవుతున్నది. గతంలో కన్నా ఈసారి భారీగా పటాకులు కాల్చేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
వేడుకకు దాతల సహకారం
ఉర్సు రంగలీలా మైదానంలో ఆదివారం సాయంత్రం నరకాసుర వధ నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్ మరుపల్ల రవి తెలిపారు. కరీమాబాద్‌లోని బీరన్నస్వామి ఆలయంలో శుక్రవారం నరకాసురవధ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నరకాసుర వధను తిలకించిన తర్వాతే దీపావళి జరుపుకోవాలని కోరారు. కమిటీ సభ్యుల కృషి, దాతల సహకారంతోనే ఏటా ఈ ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారం మరువలేనిదన్నారు. 56 అడుగుల భారీ నరకాసుర ప్రతిమ, తారాజువ్వలు ప్రజలకు కనువిందు చేయనున్నట్లు తెలిపారు. దాదాపు రూ. 5 లక్షల విలువైన పటాకులను కాల్చనున్నట్లు వెల్లడించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కోశాధికారి కనుకుంట్ల రవి, ఉపాధ్యక్షుడు వనం మధు, సహాయ కార్యదర్శులు ఆవునూరి రామ్మూర్తి, కోరె సాంబమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శులు వనం కుమార్, ప్రచార కార్యదర్శి మరుపల్ల గౌతమ్, ఆర్గనైజర్లు మాటేటి శ్యామ్, వంగరి సురేశ్, కార్యవర్గ సభ్యులు కుడికాల సాంబశివరావు, మరుపల్ల శివ, తౌటం నర్సింహ, కొమ్ము రాజు, పోలం రంజిత్, మంద పవన్ పాల్గొన్నారు.