వరంగల్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయాల్లో వింత పోకడలు పోతున్నది. గతంలో తొలగించిన వారిని మళ్లీ ఇప్పుడు సభ్యులుగా నియమిస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామ కాల్లో అవకతవకల ఆరోపణలపై పోస్టులు రద్దయినా టీచింగ్ కోటాలో ఇద్దరికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చోటు కల్పించింది. రద్దయిన నియామకాలను పునరుద్ధరించేందుకు ప్రణాళిక రూ పొందించడంలో భాగంగా కాంగ్రెస్ సర్కారు రహస్య ఉత్తర్వులను వెలువరించింది. ఈ జీవోను ఇటీవల పాలక మండలి ఆమోదించినట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో అక్రమాలకు ఈసీ వత్తాసు పలికినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2009లో 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు కాకతీయ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. మారుల జాబితాలో అవకతవకల కారణంగా నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. అనంతరం హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణ తర్వాత నోటిఫికేషన్‌కు న్యాయబద్ధత లేదని తేలింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చాయి. ఈ నోటిఫికేషన్లో పోస్టింగ్ పొందిన ఎన్ సుదర్శన్, బొద్దిరెడ్డి రమను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాకతీయ యూనివర్సిటీ పాలక మండలిలో సభ్యులుగా నియమించింది. వీరిద్దరు ఇప్పుడు పాలకమండలి సభ్యులుగా ఉండడంతో గతంలో రద్దయిన పోస్టుల ప్రక్రియను సక్రమమైనదిగా చేసేందుకు యత్నిస్తున్నారు.
2009లో జరిగిన నియామకాల్లో జరిగిన అవకతవకలపై అప్పుడే పాలకమండలి సమగ్రం గా చర్చించి ఈ ప్రక్రియను తప్పుబట్టింది. పోస్టులకు ఆమోదం తెలుపలేదు. పాలక మండలి తీర్మానాలను కాకతీయ యూనివర్సిటీ ఉన్నతాధికారులు అమలు చేశారు. శాశ్వత ప్రాతిపదికన నియామకమైన బోధన సిబ్బందిని తొలగించే అధికారం పాలకమండలికి లేదని పోస్టింగ్ పొందిన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం పోస్టులపై నిర్ణయం కోసం అప్పటి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.పురుషోత్తం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై పలుమార్లు కమిటీలు వేసింది.
పోస్టుల నియామకాన్ని ఆమోదించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో డాక్టర్ వినతారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అవి ఫలించలేదు. పోస్టుల నియామకాల అంశాన్ని యూనివర్సిటీ చట్టం ప్రకారం తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం గత మేలో జీవో ఇచ్చింది. దీన్ని బహిర్గతం చేయకపోవడంతో అనుమానాలు పెరిగాయి. జూన్ 17న జరిగిన పాలకమండలి సమావేశంలో జీవోను ఆమోదించేలా నిర్ణయం తీసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి ఇటీవలి సమావేశంలో రద్దయిన పోస్టుల అంశంపై ఎజెండాలో చేర్చడంపై విమర్శలు పెరుగుతున్నాయి. హైకోర్టు పరిధిలో ఈ అంశం ఉన్నా ఇద్దరినీ టీచింగ్ కోటాలో పాలకమండలి సభ్యులుగా కొనసాగించడం నైతికంగా సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్యాశాఖ, పోస్టుల నియామక కమిటీలు ఈ అంశంపై స్పష్టత ఇచ్చేలా పాలకమండలిలోని మిగిలిన వారు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, విశ్వవిద్యాలయ ప్రముఖులు సూచిస్తున్నారు. పోస్టింగ్‌లపై స్పష్టత లేని వారు పాలక మండలి సభ్యులుగా ఉండడంతో మొత్తం యూనివర్సిటీ పరిధిలోని పరిపాలన, నియామకాలు, నిర్ణయా లకు నైతికత, న్యాయబద్ధత ఉండబోదని చెబుతున్నారు. బాధితులు ప్రభుత్వాన్ని, పాలక మండలిని బాధ్యులుగా చేస్తూ మరోసారి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.