ములుగు, ఫిబ్రవరి29 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లాలో కింది స్థాయి ఉద్యోగికి జిల్లా అధికారి పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఏటూరునాగారం ఏసీడీపీవోగా విధులు నిర్వర్తించిన ప్రేమలతను అప్పటి కలెక్టర్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్(డీడబ్ల్యూవో)గా నియమించారు. కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారుల బదిలీలు జరుగుతున్న దృష్ట్యా ఇటీవల ఆమెను డీడబ్ల్యూవో పోస్టు నుంచి రిలీవ్ చేసి తిరిగి ఏటూరునాగారం ఏసీడీపీఓగా బదిలీ చేశారు. ఇదంతా బాగానే ఉన్నా పోస్టింగ్ వచ్చిన దగ్గర విధుల్లో చేరని ప్రేమలత ప్రస్తుతం ఏకంగా జిల్లా మైనార్టీ అధికారిణిగా పోస్టింగ్ తెచ్చుకోవడంపై ఉద్యోగులు విమర్శి స్తు న్నారు. జిల్లా స్థాయి అధికారిగా నియమించాలంటే ఎఫ్ఏసీ విధానం ప్రకారం సీనియర్ అధికారులను నియమించాల్సి ఉంటుందని, ఇలా ఏసీడీపీవో స్థాయి అధికారిని జిల్లా మైనార్టీ అధికారిగా ఎలా నియమిస్తారని ముక్కున వేలేసుకుంటున్నారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పనిచే స్తున్న సదరు ఉద్యోగిని మైనార్టీ శాఖ జిల్లా అధికారి ఎలా అవుతుందని చర్చించుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జరగాల్సిన బదిలీలు, నియామకాలు అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయని పలువు రు విమర్శిస్తున్నారు. సంక్షేమ శాఖలో ప్రేమలత కంటే సీనియర్లు ఉన్నప్పటికీ అర్హులైన అధికారులే లేనట్లు ఆమెకే జిల్లా స్థాయి అధికారి పోస్టింగ్ రావడంపై పైరవీలకే ప్రాధాన్యత లభించినట్లయిందని ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.